మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని... పశ్చిమగోదావరి జిల్లా డిప్యూటీ ఎలక్షన్ అథారిటీ, సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆదివారం ఉదయం 8గంటలకు వైఎన్ కళాశాలలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని విశ్వనాథన్ తెలిపారు. ఒకే రౌండ్లో పలితాలు వెల్లడిస్తామని వివరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఫలితాలు త్వరితగతిన వెల్లడించేందుకు వీలుగా అన్ని ఏర్పాటు చేశామన్నారు.
జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో 29వార్డులు, నిడదవోలులో మొత్తం 28 వార్డులకు ఓట్ల లెక్కింపు జరగనుంది. కొవ్వూరు పురపాలికలో 23వార్డులకుగానూ.. 13ఏకగ్రీవమయ్యాయి. నరసాపురం మున్సిపాలిటిలో 31వార్డులు ఉండగా 3వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ ఉదయం 8 గంటలు నుంచి సాయంత్రం 4 గంటలు వరకు జరుగుతుందని.. ప్రతీ మండలంలో ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. డివిజన్ పరిధిలో మొత్తం 2,488 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు విశ్వనాథన్ తెలిపారు. అత్యధికంగా భీమవరంలో 792 మంది, పాలకొల్లులో 510 మంది ఓటర్లు ఉన్నారు.
ఇదీ చూడండి: 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోండి'