Aqua Farmers Problems: రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల ఎకరాల్లో రైతులు రొయ్యల సాగు చేస్తున్నారు. ఇందులో సుమారు 2 లక్షల ఎకరాలు నిడమర్రు, గణపవరం, పాతకోడేరు, ఉండి, భీమవరం ,కాళ్ల, ఆకివీడు మండలాల పరిధిలోనే ఉంది. ఆక్వా సాగు జరిగే ప్రాంతాల్లోని రైతులకు.. ఎటువంటి కోతలు లేకుండా విద్యుత్ అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పగటి వేళల్లో కొద్ది సేపు కరెంటుకు అంతరాయం ఏర్పడినా.. సర్దుబాటు చేసుకోడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అలా కాకుండా రాత్రి వేళల్లో కోతలు పెడుతున్నారు. దీంతో లక్షల రూపాయల ఖర్చుతో రొయ్యల సాగు చేపట్టిన అన్నదాతలు.. దాన్ని కాపాడుకోవడానికి కంటి మీద కునుకు లేకుండా చెరువుల దగ్గర కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విద్యుత్ అంతరాయం కారణంగా కనీసం 10 నిమిషాలు ఏరియేటర్స్ ఆగిపోయినా.. ఆక్సిజన్ అందక రొయ్యకు ఇబ్బంది ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
‘గణపవరం మండలం కేశవరం పరిధిలోని మూడు ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నా. వేళాపాళా లేకుండా విధిస్తున్న విద్యుత్ కోతల కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమయంలో జనరేటర్ నిర్వహణ కోసం రోజుకు రూ.3 వేలు ఖర్చు చేస్తున్నా. ఇప్పటికే రొయ్యల ధర ఆశించిన స్థాయిలో లేదు. దీనికితోడు డీజిల్, జనరేటర్ కోసం చేసే ఖర్చు అదనపు భారంగా మారింది’-సప్పా ప్రవీణ్, పశ్చిమగోదావరి జిల్లా రైతు
విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో జనరేటర్ వినియోగానికి గంటకు కనీసం 5 నుంచి 6 లీటర్ల డీజిల్‌ను ఉపయోగించాల్సి ఉంది. దీనికి 6వందల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. ఈ లెక్కన రోజుకు 3 గంటల పాటు జనరేటర్ వినియోగానికి రూ.18 వందల వరకూ రైతులు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పాటు జనరేటర్ సామర్థ్యాన్ని బట్టి నెలకు 10 వేల నుంచి 20 వేల రూపాయల వరకు అద్దె రూపేణా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే రొయ్య మేత, విద్యుత్ ఛార్జీలు, ఇతర ఖర్చులతో ఎకరాకు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చువుతుందని.. ఈ అదనపు వ్యయాలతో పెట్టుబడి భారీగా పెరిగిపోతుందని రైతులు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాభాల మాట ఎలా ఉన్నా.. పెట్టుబడి కూడా వెనక్కి రావడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘నిడమర్రు మండలంలో సుమారు 10 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నా. నెల రోజులుగా రోజూ విద్యుత్ కోతలు తప్పడం లేదు. రొయ్యలను కాపాడుకోటానికి నిత్యం జనరేటర్‌లో డీజిల్ కోసం రూ.4 వేలు ఖర్చు చేస్తున్నా. గతంలో గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం లేదని కోతలు పెట్టారు. ఇప్పుడు ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేసినా సమస్య తీరలేదు’-చనపతి సూరిబాబు, రైతు
ఇవీ చదవండి: