Atrocity case on MP Raghurama: నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజుపై పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి కాజాలో ఐపీసీ సెక్షన్లు , ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది . పిటిషనర్ వ్యాఖ్యలకు ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించింది . ఐపీసీ సెక్షన్ 500 కింద కేసు పెట్టడాన్ని ఆక్షేపించింది . పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలన్నింటిని నిలుపుదల చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది . రాష్ట్ర ప్రభుత్వానికి , ఫిర్యాదిదారు గొంది రాజుకు నోటీసులు జారీచేసింది . హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు . ఓ టీవీ చర్చాకార్యక్రమంలో రెండు వర్గాల మధ్య మత విద్వేషాలు రేకెత్తించేలా ఎంపీ వ్యాఖ్యాలు చేశారంటూ గొంది రాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చింతలపూడి పోలీసులు ఐపీసీ 153ఏ , 500 , ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు . తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, దానిని రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు . పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్ వ్యాఖ్యలకు వర్తించవని పిటిషనర్ న్యాయవాది శ్రీ వెంకటేశ్ వాదనలు వినిపించారు. యాంకర్ అడిగిన ప్రశ్నలకు పిటిషనర్ సమాధానం మాత్రమే ఇచ్చారన్నారు. సంబంధ లేని వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తప్పుడు కేసు పెట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చెల్లదన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. ఎఫ్ఐఆర్ ఆధారంగా చేపట్టే తదుపరి చర్యలను నిలుపుదల చేశారు.
ఇదీ చదవండి:
CBN: ప్రత్యేక హోదాపై యుద్ధం చేయకుండా.. పలాయనవాదమెందుకు? : చంద్రబాబు