Polavaram: 'పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించే వరకు.. అండగా ఉంటాం' - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
పోలవరం నిర్వాసితుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించే వరకు వారికి తోడుగా ఉంటామని విపక్షాలు స్పష్టం చేశాయి. ముంపు గ్రామాల నుంచి నిత్యావసరాల కోసం వచ్చేవారిని ఇబ్బంది పెట్టడం.. ప్రజలను భయపెట్టి సమావేశాలకు రాకుండా పోలీసులు అడ్డుకోవడం వంటి చర్యలపై... నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరం నిర్వాసితుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించే వరకు అండగా ఉంటామని వివిధ పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. పోలవరంలోని అంబేడ్కర్ సెంటరులో మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశానికి వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. ముంపు గ్రామాల నుంచి నిత్యావసరాల కోసం వచ్చేవారికి అనుమతి తప్పనిసరి అంటూ అధికారులు అడ్డుకోవడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణ సాయంగా నిర్వాసితులకు మూడు నెలలకు సరిపడా బియ్యం, కిరోసిన్, టార్పాలిన్లు, కందిపప్పు అందజేయాలన్నారు. ప్రజలను భయపెట్టి సమావేశాలకు రాకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. సమావేశం ప్రారంభమైన కొంతసేపటికే విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వరద పెరుగుతుండటంతో నిర్వాసితులు కొండలు, గుట్టలపైకి చేరుతున్నారన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
తెదేపా ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ అప్పట్లో అఖిలపక్షంతో చంద్రబాబునాయుడు ఎందుకు సమావేశాలు నిర్వహించలేదని జగన్ ప్రశ్నించారని, మరి ఇప్పుడు ఎందుకు అఖిలపక్షంతో సమావేశం నిర్వహించడం లేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఎంత మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించారో తెలియజేయాల న్నారు.
మాజీ ఎమ్మెల్యే చందా లింగాయ్య మాట్లాడుతూ ఆదివాసీల విషయమై మానవత్వంతో వ్యవహరించాలన్నారు. నిర్వాసితులు బోరగం రాజామణి, కుంచే దొరబాబు, సుబ్బారావు తదితరులు తమ సమస్యలను వివరించారు. తెదేపా నాయకులు జవహర్, శ్రీనివాసరావు, జ్యోతుల నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ కిసాన్‌సెల్ అధ్యక్షుడు జెట్టి గురునాథం, జనసేన పార్టీ తరఫున లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: