గోదావరి తనకు తానుగా పరమశివున్ని అభిషేకించే ఘటన ఇది. ఈ అపురూప దృశ్యం చూడాలంటే పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామానికి రావాల్సిందే.
మల్లేశ్వరం గ్రామంలో సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన కపిల మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. కపిల గోవు పాలతో స్వామివారిని అభిషేకించడం వల్ల ఆ పేరు వచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయానికి కొంత దూరంలో గోదావరి నది ప్రవహిస్తుంది. నది జలకళను సంతరించుకున్న సమయంలో ఆలయంలోని స్వామి వారి పానుపట్టం అడుగు నుంచి గర్భగుడిలో నీరు ఉప్పొంగుతుంది. శివ లింగాన్ని ముంచెత్తుతుంది. వరద ఉద్ధృతి కొనసాగినంత కాలం స్వామివారు జల దిగ్బంధంలో ఉంటారు. ఉద్ధృతి తగ్గగానే తనకు తానుగా గోదారమ్మ నిష్క్రమిస్తుంది.
గోదావరి జలాలతో అభిషిక్తుడు అయిన స్వామి వారిని దర్శించడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. గోదావరి మాత తనకు తానుగా స్వామివారిని అభిషేకించడం ప్రత్యేకతగా అర్చకులు చెబుతున్నారు.
ఇదీ చదవండి