అమెరికాలో పుట్టి పెరిగిన ఓ అమ్మాయి... రాష్ట్రంలోని ఓ గ్రామంలో కళావేదిక నిర్మించింది. తన తండ్రి చదువుకున్న పాఠశాలలో ఆయన జ్ఞాపకంగా వేదికను ఏర్పాటు చేయించింది. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు గ్రామానికి చెందిన సైపురెడ్డి సత్యనారాయణ... అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలో ఉండగా అనారోగ్యానికి గురై అకస్మాత్తుగా మృత్యుఒడికి చేరారు. సత్యనారాయణ కుమార్తె అమృత... న్యూజెర్సీలోని పాఠశాలలో చదువుకుంటూ... అక్కడే ప్యూర్ స్వచ్ఛంద సంస్థలో వాలంటీర్‌గా పనిచేస్తోంది. అమృత సంప్రదాయ నృత్యాన్ని నేర్చుకుంది. తండ్రి అకాల మరణంతో కలత చెందినప్పటికీ... ఆయన జ్ఞాపకాలను పదిలం చేసుకోవాలని నిర్ణయించుకుంది.
తండ్రి పుట్టిన ఊరుకి సేవ...
తన తండ్రి పుట్టిన... తూర్పు విప్పర్రు గ్రామంలో సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకుంది అమృత. తాను నేర్చుకున్న నృత్యంలో అరంగేట్రం చేసి... ప్రదర్శనల ద్వారా విరాళాలు సేకరించింది. తాను వాలంటీర్‌గా పనిచేస్తున్న ప్యూర్ సంస్థ సహకారాన్ని అందిపుచ్చుకుంది. తూర్పు విప్పర్రు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో... విద్యార్థులు కార్యక్రమాలు నిర్వహించుకోడానికి కళావేదికను నిర్మించింది. అందుకు మూడున్నర లక్షలు విరాళంగా అందజేసింది. కళావేదిక నిర్మాణంలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంధ్య గొల్లమూడి పాలుపంచుకున్నారు.
తండ్రి ఆశయ సాధన కోసం 14 ఏళ్ల అమృత పట్టుదలను పలువురు అభినందిస్తున్నారు. నాన్నకు ప్రేమతో అన్న రీతిలో తండ్రిపై అభిమానాన్ని చాటుకుంటున్న అమృతను ఆశీర్వదిస్తున్నారు. ఉన్న తల్లిదండ్రులనే వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న వారికి... చనిపోయిన తండ్రి కోసం తన నాట్య ప్రదర్శనలతో విరాళాలు సేకరించి... కళావేదిక నిర్మించిన అమృత ఔదార్యం ఎంతో ఆదర్శనీయం కదూ..!
ఇవీ చదవండి..