Amaravati Farmers Padayatra: అమరావతి పరిరక్షణ కోసం కర్షకులు కదం తొక్కుతున్నారు. జోరు వాననూ లెక్కచేయకుండా ఉద్యమిస్తున్నారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన మలివిడత పాదయాత్ర.. గోదావరి జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. పూలు, హారతులతో స్థానికులు ఆహ్వానం పలుకుతున్నారు. 27వరోజు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం నుంచి యాత్ర ప్రారంభమైంది. స్వామి రథానికి పూజలు చేసి.. శంఖం పూరించి రైతులు నడక ప్రారంభించారు.
పాదయాత్రపై వైకాపా నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని రైతులు మండిపడ్డారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతిపై అక్కసుతోనే 3 రాజధానులంటూ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోందని ధ్వజమెత్తారు. ఎన్ని కుట్రలు చేసినా.. అమరావతిని సాధించి తీరుతామని స్పష్టం చేశారు.
పాలకొల్లు మండలం శివదేవునిచిక్కాల, దగ్గులూరులో రైతులకు మహిళలు హారతులిచ్చి అపూర్వ స్వాగతం పలికారు. అమరావతికి సంఘీభావంగా 100 ట్రాక్టర్లతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. యాత్రలో మాజీ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ పాల్గొన్నారు. దగ్గులూరు సాయిబాబా గుడి వద్ద రైతులకు స్థానికులు సాదరంగా ఆహ్వానం పలికారు. ఎమ్మేల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మేల్సీ రాంమోహన్ పాదయాత్రలో పాల్గొన్నారు. రైతులకు వామపక్షాలు, ఎస్సీ, బహుజన ఐకాస నేతలు సంఘీభావం తెలిపారు.
పూలపల్లిలో రైతులు భోజన విరామం తీసుకున్నారు. రాజధాని రైతులకు తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు మహేశ్ యాదవ్ 2లక్షల నగదు, 25 క్వింటాళ్ల బియ్యం అందజేశారు. పూలపల్లి Y-జంక్షన్ మీదుగా 14 కిలోమీటర్ల మేర సాగిన యాత్ర పాలకొల్లులో ముగిసింది. పాదయాత్ర రేపు యథావిధిగా కొనసాగనుందని ఐకాస నేతలు తెలిపారు.
ఇవీ చదవండి: