YCP Leader Land Encroachments in Vizianagaram District: ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పుడు భూమి బంగారంగా మారింది. ఆస్తుల విలువలు సైతం రెట్టింపవ్వడంతో కొందరు ప్రభుత్వ పెద్దల కన్ను వాటిపై పడింది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో అధికారపార్టీ ప్రజాప్రతినిధి ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఆయన కన్నుపడిందంటే భూములు, ఆస్తులపై ఆశలు వదులుకోవాల్సిందే.
ఇచ్చినంత పుచ్చుకుని ఆస్తులు, భూములు అప్పగించాల్సిందే: అక్కడ ఏ సెటిల్‌మెంట్ చేయాలన్నా ఆయన చేయాల్సిందే. ఎంతటి పెద్దవారైనా సరే ఆయన ఆదేశాలకు తలొగ్గాల్సిందే. ఇచ్చినంత పుచ్చుకుని విలువైన ఆస్తులు, భూములు అప్పగించాల్సిందే. బెట్టు చేస్తే కాళ్లబేరానికి వచ్చేలా చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. తన బంధువైన రాష్ట్రస్థాయి నాయకుడికి నీడగా గుర్తింపు పొందిన ఆ వైసీపీ నేత అరాచకాలు, అక్రమాలు భరించలేకపోతున్నామని సొంతపార్టీ నేతలే వాపోతున్నారు. సీఎం జగన్‌ను సైతం ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండానే నేరుగా కలిసే అంత చొరవ ఉండటంతో ఎవరూ ఏమీ అనలేకపోతున్నారు.
అవినీతి ఆక్టోపస్: అధికార బలంతో యంత్రాంగాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుని దందాలు సాగిస్తున్నాడు. జిల్లావ్యాప్తంగా ‘అవినీతి ఆక్టోపస్’లా విస్తరించిన ఈ నాయకుడు ప్రతి నియోజకవర్గంలోనూ కొందరు మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. వారు ఆయా ప్రాంతాల్లోని భూదందాలు, వివాదాలు, ఇతర సెటిల్‌మెంట్ల వ్యవహారాలను ఈయన దృష్టికి తీసుకెళ్తారు. ఆయన ఇరువర్గాలను పిలిపించి తాను అనుకున్నవారికి అనుకూలంగా సెటిల్‌మెంట్ చేసి భారీ మొత్తంలో వాటాలు దక్కించుకుంటారు. అవతలి వారు మాట వినకుంటే బెదిరించడం షరా మామూలే. ఒక్కోసారి ఇరువర్గాలను బయపెట్టి తక్కువ ధరకే ఆ భూములు దక్కించుకుంటారు.
రౌడీల్ని అడ్డం పెట్టుకుని స్థిరాస్తి వ్యాపారం - విశాఖలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత
ఎదిరించే ధైర్యం లేక: ఇటీవల ఓ మూతపడిన పరిశ్రమకు చెందిన భూములను ఓ ఐదుగురు కలిసి కొనుగోలు చేశారు. అడ్వాన్స్‌గా కొంత చెల్లించి మిగిలిన సొమ్ము 5 నెలల్లో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని తెలిపారు. ఈ భూములపై కన్నేసిన వైసీపీ నేత వారిని పిలిపించి సగం వాటా ఇవ్వాలని బెదిరించారు. చేసేది లేక వారు సరేనన్నారు. మరోసారి వారిని పిలిపించి ఆ భూముల విషయంలో ఎన్నో చిక్కులు ఉన్నాయని వాటిని తాను పరిష్కరించుకుంటానని చెప్పి మొత్తం తనకే రాసివ్వాలని కోరాడు. వారికి గుడ్‌విల్ పేరిట కొంత మొత్తం ముట్టజెప్పి ఆ భూముల్ని సొంతం చేసుకున్నారు. ఆయన్ను ఎదిరించే ధైర్యం లేక వారు మిన్నకుండిపోయారు.
కూర్చోబెట్టి టీ తాగించి: విజయనగరంలో ఓ అత్యంత విలువైన స్థలంపై కన్నేసి ఆ నేత తన అనుచరులతో నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు యత్నించారు. చట్టపరంగా పోరాడేందుకు ఆ స్థలం యజమాని సిద్ధమవ్వగా.. అతన్ని పిలిచి బెదిరించారు. ఆ వ్యక్తి మంత్రి వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా ఆ నేతకు ఫోన్ చేసి మాట్లాడారు. తన సమస్య పరిష్కారమైనట్లేనని భూ యజమాని భావించాడు. ఇంతలో సదర నేత నుంచి ఫోన్ రాగా ఆశగా ఆయన దగ్గరకు వెళ్లాడు. కూర్చోబెట్టి టీ తాగించి ఆ భూమిని మీరు వదులుకోవాల్సిందేనని ఇక మీరు వెళ్లిపోవచ్చంటూ తాపీగా చెప్పారు. ఉలిక్కిపడిన బాధితుడు మంత్రి గారు చెప్పారు కదా అని ప్రాధేయపడగా ఆయన చెప్పారు కాబట్టే కూర్చోబెట్టి మాట్లాడాను. లేకుంటే కథ వేరేలా ఉండేది’ అంటూ సమాధానమిచ్చారు. జిల్లాలో ఆయన భూకబ్జాలు ఏ స్టైల్‌లో చేస్తారో చెప్పేందుకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.
అలా రైస్‌మిల్లు దక్కించుకున్నాడు: గరివిడిలో మూడెకరాల భూమి కొనేందుకు ముగ్గురు వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకున్నారు. కొంత మొత్తం అడ్వాన్సుగా చెల్లించి మిగతా మొత్తాన్ని మూడు నెలల్లోగా ఇస్తామన్నారు. గడువులోగా వారు డబ్బులు చెల్లించకపోవటంతో పంచాయతీ వైసీపీ నేత వద్దకు చేరింది. అతను ఆ భూములను తన బినామీ పేర్లమీద రిజిస్ట్రేషన్ చేయించుకుని పరిష్కారం చూపారు. వాటిల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి భారీగా సొమ్ము చేసుకున్నారు. నెల్లిమర్ల మండలంలో ఓ రైస్‌మిల్లు విక్రయించేందుకు దాని యజమాని ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొనుగోలుదారులు, అమ్మకందారు మధ్య వివాదం తలెత్తటంతో ఛోటా నేత పంచాయతీ చేశారు. రైస్‌మిల్లు నేను తీసుకుంటా, మా పేరిటే ఉంటుందంటూ వాస్తవ విలువ కంటే చాలా తక్కువ మొత్తం చెల్లించి దాన్ని దక్కించుకున్నాడు. తన కుమార్తె పేరుతో ఆ రైస్‌మిల్లు నడిపిస్తున్నారు.
అత్యంత విలువైన భూములను అతి తక్కువ ధరకే: ఓ పరిశ్రమ యాజమాన్యం నుంచి అత్యంత విలువైన భూములను అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు. పారిశ్రామికవాడ కింద ఉన్న ఆ భూములను తన పలుకుబడి ఉపయోగించి సాధారణ భూములుగా కన్వర్షన్ చేయించుకున్నారు. వాటిని తన కుమార్తె, రెండో భార్య సోదరుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి భారీగా సొమ్ము చేసుకున్నారు. సదరు నేత కొన్నేళ్ల క్రితం ఓ పైపుల పరిశ్రమ పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాని టర్నోవర్ అమాంతం పెరిగింది.
ఆ అవకాశం ఇంకెవరికీ ఉండదు: ఉమ్మడి జిల్లా పరిధిలో ఇంటింటికీ తాగునీరు అందించే ప్రాజెక్టు పనుల పైపులన్నీ తమ పరిశ్రమ నుంచే కొనుగోలు చేయాలంటూ హుకుం జారీచేశారు. దీనికి సహకరించని అధికారిని బదిలీ చేయించి తాను చెప్పినదానికి తలాడించే అధికారిని తెచ్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఈ కంపెనీ పైపులే వినియోగిస్తున్నారు. తద్వారా భారీగా లబ్ధిపొందారు. జిల్లాలో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణం, నిర్వహణ తదితర పనులన్నీ తన భాగస్వాములైన ఇద్దరు గుత్తేదారులకే దక్కేలా చేస్తారు. ఇంకెవరికీ అవకాశమే ఉండదు.
సెటిల్ చేసి భారీగా సొమ్ము చేసుకుని: ఎస్.కోట నియోజకవర్గంలో ఈనాం భూముల్లోని ఓ చెరువు వ్యవహారంలో కొందరికి అనుకూలంగా సెటిల్‌మెంట్ చేసి భారీగా లబ్ధి పొందారు. బొబ్బిలిలో మూతపడిన ఓ పరిశ్రమ స్థలం కొనుగోలు వ్యవహారంలో చక్రం తిప్పి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. పార్వతీపురం నియోజకవర్గంలో ఓ కర్మాగారం భూముల వేలంలోనూ తెరవెనక కథ నడిపించి మంచి లాభం పొందారని తెలిసింది. రామభద్రాపురం మండలంలో ఓ రియల్ ఎస్టేట్ లే అవుట్ విషయంలో దాని యజమానులు ఇద్దరి మధ్య విభేదాలు నెలకొనగా దాన్ని సెటిల్ చేసి భారీగా సొమ్ము చేసుకున్నారు.
ఒంగోలులో కొనసాగుతున్న భూకబ్జాలు - నకిలీ స్టాంపులు, అక్రమ రిజిస్ట్రేషన్లతో మోసాలు