BRIDGE : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నదులు, గెడ్డలను ఆనుకొని జీవిస్తున్న పల్లెవాసుల నిత్య వేదన ఇది.. నదులు, గెడ్డలపై వంతెనలు లేక పల్లెవాసులు ప్రమాదాలతో సహవాసం చేస్తున్నారు. గజపతినగరం మండలంలో మర్రివలస పంచాయతీ చంపావతి నదికి ఆవల ఉంది. వంతెన లేకపోవడంతో గ్రామస్తులు నిత్యం నది దాటుకుని బాహ్య ప్రపంచానికి వస్తుంటారు. విద్యార్థులు ఇంటి నుంచి మామూలు దుస్తుల్లో వచ్చి... నది దాటిన తర్వాత తడిసిన వాటిని ఆరబెట్టుకొని యూనిఫాం వేసుకుని బడికి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక్కడ మూడేళ్ల క్రితమే 5 వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసినా పనులు ఇంకా మొదలు కాలేదు.
గజపతినగరం మండలం గంగచోళ్ల పెంట పంచాయతీ పట్రువాడలోనూ అదే పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గ్రామస్థులు నది దాటుతుంటారు. మూడేళ్ల క్రితం ఇక్కడ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభించలేదు. గ్రామానికి చెందిన యువకులే చందాలు పోగు చేసుకునే నదిలో పైపులు వేసుకొని దాటుతున్నారు. విద్యార్థులకు ఈ నది దాటటం సాహస కృత్యమే.
నదులు, గెడ్డలు ఉద్ధృతంగా ప్రవహిస్తే.. ప్రవాహం తగ్గే వరకు ఇలాంటి గ్రామాల వారు ఊరుదాటే పరిస్థితి లేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి నది దాటాల్సిందే. ఇటీవల వర్షాల సమయంలో పట్రవాడ గ్రామానికి చెందిన గర్భిణులు.. ముందుజాగ్రత్తగా ఆసుపత్రిలో ముందుగానే చేరాల్సి వచ్చింది. అధికారులు ఏళ్ల తరబడి నాన్చకుండా వంతెనలు త్వరగా నిర్మించి.. అవస్థలు తీర్చాలని ఈ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: