విజయనగరం మున్సిపాలిటీ జులై 3నుంచి కార్పొరేషన్‌గా మారబోతున్న నేపథ్యంలో వార్డులను డివిజన్లుగా చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం పట్టణంలోని 40 వార్డులను 50 డివిజన్లుగా తీర్చిదిద్దాలని ఆదేశిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 164 విడుదల చేసింది.
విజయనగరం... 1978లో పురపాలక సంఘంగా ఏర్పడింది. 1998 నాటికి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాల్టీగా మారింది. ప్రస్తుతం 57.01 చదరపు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 2 లక్షల 44 వేల 598 మంది ఉన్నారు.
నానాటికీ విస్తరిస్తున్న పట్టణానికి తోడు.. జనాభా పెరుగుతున్న కారణంగానే.. విజయనగరాన్ని కార్పొరేషన్‌గా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక అధికార యంత్రాంగం డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు చేసింది. ఇదే సందర్భంలో.. పలువురు కౌన్సెలర్లు అభ్యంతరాలు తెలిపారు. 2011 జనాభా ప్రాతిపదికన చేసిన వార్డుల విభజన తమకు అమోదయోగ్యంగా లేదంటూ 15మంది కౌన్సిలర్లు అభ్యంతరాలు తెలియచేశారు.
ఈ నెలాఖరు నాటికి వార్డుల విభజన నివేదిక, అభ్యంతరాలను విజయనగరం పట్టణ ప్రణాళిక అధికారులు డీఎంఏ పరిశీలనకు పంపనున్నారు. జులై 3,4,5,6 తేదీల్లో ప్రభుత్వ అధ్యయనం అనంతరం డివిజన్ల ఏర్పాటుపై ప్రభుత్వం ఆమోదముద్ర వేయనుంది. అనంతరం విజయనగరం పురపాలక సంఘానికి నగరపాలక సంస్థ హోదా రానుంది.