ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు(77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వంగపండు.. మంగళవారం ఉదయం విజయనగరం జిల్లా పార్వతీపురం వై.కె.ఎం.నగర్‌లోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. పార్వతీపురం ప్రత్యేక జిల్లా కావాలి అంటూ 10 రోజుల క్రితం ఉద్యమంలో కూడా పాల్గొన్న వంగపండు.. ఈ రోజు వేకువజామున కన్నుమూశారు
వంగపండు ప్రసాదరావు వందలాది జానపద పాటలను రచించారు. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడిపాడారు. ఉత్తరాంధ్ర జానపదానికి కాణాచిగా నిలిచిన వంగపండు ప్రసాదరావు... పల్లెకారులతో పాటు గిరిజనులనూ చైతన్యపరిచారు. జన పదమే.. జానపదమని .. చివరి వరకు నమ్మిన వంగపండు... విప్లవకవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుపొందారు.
వంగపండు ప్రసాదరావు 1943లో విజయనగరం జిల్లా పెదబొండపల్లిలో జన్మించారు. 'అర్థరాత్రి స్వాతంత్య్రం' సినిమాతో వంగపండు సినీప్రస్థానం ప్రారంభమైంది. పలుచిత్రాల్లో వంగపండు ప్రసాదరావు నటించారు. ఎక్కువగా విప్లవ పాటల్లో కనిపించారు. కదలాడే చైతన్యంగా వంగపండును సినీ పరిశ్రమ అభివర్ణించేది.
- ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరు గాంచారు
- 2017లో కళారత్న పురస్కారం అందుకున్న వంగపండు
- 1972లో జననాట్యమండలిని స్థాపించిన వంగపండు
- మూడు దశాబ్ధాలలో 300 పాటలు రచించిన వంగపండు
- 'ఏం పిల్లడో ఎల్దమొస్తవ' పాటతో ప్రఖ్యాతి చెందిన వంగపండు