CONFLICT BETWEEN TWO FAMILIES: విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస గ్రామంలో రెండు కుటుంబాల మధ్య స్థలం విషయంలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఖాళీ స్థలంలో చెత్త వేస్తున్నారన్న విషయంలో ఇరు కుటుంబాలకు మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు విచక్షణా రహితంగా కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం శ్రీకాకుళం హాస్పిటల్కు తరలించారు.
విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం బాధితుల వద్ద వివరాలు సేకరించారు. ఈ ఘటనలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజకీయ కక్షతోనే వైసీపీకి చెందిన వారు తమపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయలేదనే కక్షతోనే తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి..: కడప జిల్లా సిద్దవటం మండలం ఓబులమ్మ వంక వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వంక సమీపంలో ఒక చెట్టుకు అతడి మృతదేహం వేలాడుతూ.. బుధవారం లభ్యమైంది. మృతుడి వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా అతడిని నెల్లూరు జిల్లా పెనుబర్రి గ్రామానికి చెందిన కోప్పల బాబు(46)గా గుర్తించారు. పోలీసులు సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇది హత్యా?లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
మద్యం మత్తులో మురుగు కాలువలో పడిన వ్యక్తి..: మద్యం మత్తులో ఓ వ్యక్తి బుధవారం మురుగు కాలువలో పడ్డాడు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. నగరంలోని నడిమి వంక సమీపంలో వంతెన నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మురుగు మట్టిని తొలగించారు. అటుగా వస్తున్న ఓ వ్యక్తి మద్యం మత్తులో కాలుజారి మురుగు నీటిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు జేసీబీ వాహన సహాయంతో అతడిని బయటకు తీశారు. కాలువ సమీపంలో విద్యుత్ దీపాలు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నిర్మాణ పనుల సమయంలో వాహనదారులు, ఇతరత్రా వ్యక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకొని విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: