కరోనా కష్టకాలంలో ఆర్టీసీని విత్తనాభివృద్ధి సంస్థ ఒకింత ఆదుకుంటుంది. రైతులకు అందించే విత్తనాలు పంపిణీకి అప్పటి వరకు ప్రైవేటు వాహనాలు మాత్రమే వినియోగించిన ఈ సంస్థ... గత ఏడాది నుంచి ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ.. రైతులతో ఒప్పందం ప్రకారం విత్తనాలు అందించి మళ్లీ వాటిని కొనుగోలు చేస్తోంది. వీటిని నిల్వ చేసేందుకు విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని జనవరి వలస, బొండపల్లి సమీపంలోని నెలివాడ, పార్వతీపురం, చీపురువలసల్లో గోదాములు ఉన్నాయి. ఇందులో జనవరి వలసలో ఉన్న గోదాము అతి పెద్దది. 20వేల స్క్వేర్ ఫీట్, 25 వేల స్క్వేర్ ఫీట్ ల్లో రెండు గోదాములు ఉన్నాయి. దాదాపు 35వేల క్వింటాళ్లు నిల్వ చేయవచ్చు,.ఇక్కడి నుంచి జిల్లాలోని ఎక్కువ మండలాలకు విత్తనాల పంపిణీ చేస్తుంది.
గత ఏడాది నుంచి రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు అందిస్తున్నారు. 2019 వరకు కేవలం మండల కేంద్రాలకు మాత్రమే ఈ విత్తనాల సరఫరా జరిగేది. అక్కడి నుంచి రైతులు అతి కష్టంపై తమ గ్రామాలకు, పొలాలకు తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఇలా కాదు. కేవలం గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు నుంచి వారు తీసుకుంటే సరిపోతుంది. ఒక్క సాలూరు మండలానికి 1200 నుంచి 1300 క్వింటాళ్ల వరి విత్తనాలు ఈ సంస్థ ద్వారా పంపిణీ జరుగుతోంది. జిల్లాలో ఈ ఖరీఫ్ కు 56,602 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ ఇప్పటికే సంస్థకు ఇండెంట్ ఇచ్చింది. వీటిని ఒకప్పుడు కేవలం ప్రైవేట్ లారీల ద్వారా పంపిణీ చేసేవారు. ఆ ఆదాయమంతా కూడా వారికే అందేది. కానీ గత సంవత్సరం కరోనా వచ్చిన తర్వాత ఖరీఫ్ కు ( జూన్ మొదటి వారం నుంచి ) ఆర్టీసీ బస్సుల ద్వారా ఈ విత్తనాలను సరఫరా చేస్తున్నారు. జనవరి వలస గోదాముల నుంచి ఆయా మండలాల్లోని రైతు భరోసా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులోనే చేర్చారు. 2020-21 సంవత్సరానికి విత్తనాభివృద్ధి సంస్థ విజయనగరం జిల్లాలో 44, 000 క్వింటాలు సేకరిస్తే.. 56,450 క్వింటాళ్లు సరఫరా చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 48,000 క్వింటాళ్లు సేకరించింది. ఖరీఫ్ కు 56,602 క్వింటాళ్లకు సంస్థ వద్ద ఇండింట్ ఉంది. దీనిని జూన్ మొదటి వారం నుంచి సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా సంస్థ సేకరించి రైతులకు అందిస్తుంది. అలాగే ఇక్కడ పండే కొన్ని రకాల విత్తనాలను ఇతర జిల్లాలకు కూడా పంపిణీ చేస్తోంది.
గత ఏడాది జూన్ మొదటి వారం నుంచి జూలై రెండో వారం వరకు ఆర్టీసీ ద్వారా పంపిణీ జరిగింది. దీనికోసం సంస్థ నుంచి ఆర్టీసీకి వచ్చిన ఆదాయం దాదాపు 35 లక్షల రూపాయలు. ఇలా ఈ సంవత్సరం కూడా సేవలు అందించేందుకు ఆర్టీసీ రెన్యువల్ చేసుకుంది. ఇందుకోసం కేవలం కార్గో బస్సులనే కాకుండా ప్రయాణీకులను నడిపే బస్సులను కూడా ఆర్టీసీ వినియోగిస్తుంది. కరోనా వల్ల వచ్చిన నష్టాన్ని ఇక్కడ కొంతమేరకు ఆర్టీసీ పూడ్చుకోగలిగింది.
ఇదీ చదవండి