Concern of Bhogapuram airport residents: భోగాపురం విమానాశ్రయం నిర్వాసిత గ్రామాల్లో అలజడులు ఆగడం లేదు. మరడపాలెంలో ఇళ్ల తొలగింపునకు అధికారులు సమాయత్తం కావడం ఉద్రిక్తతకు దారి తీసింది. భోగాపురం తహసీల్దార్ శ్రీనివాసరావు 10 జేసీబీలు.. 10ట్రాక్టర్లతో మోహరించగా.. సీఐ విజయనాథ్ పోలీసులను తరలించారు.
ఇళ్లు ఖాళీ చేసేందుకు ఇష్టపడని గ్రామస్థులు.. పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండా గ్రామం ఎలా ఖాళీ చేస్తామని అధికారులను నిలదీశారు. వసతులన్నీ కల్పించాకే ఊరు ఖాళీ చేస్తామని.. అప్పటిదాకా కదిలేది లేదని మరడపాలెం వాసులు తెగేసి చెప్పారు. అదేవిధంగా నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటికీ పూర్తిగా అమలు చేయలేదు. అప్పట్లో ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలోని వసతులు, పరిహారం తదితర అంశాలు సైతం సంపూర్ణంగా అమలు కాలేదన్నారు.
బాధితులకు నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు అండగా నిలిచారు. పునరావాస ప్యాకేజీ ప్రకారం వసతులు, పరిహారం అందించకుండా ఎలా ఒత్తిడి తెస్తారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ఇళ్ల కూల్చివేతపై టీడీపీ, జనసేన నేతలు కలెక్టర్ సూర్యకుమారికి విజ్ఞప్తి చేశారు. భోగాపురం విమానాశ్రయ నిర్వాసిత గ్రామాల తరలింపుపై కలెక్టర్‌ను గడువు కోరారు. నిర్వాసితుల గ్రామాల్లో సరైన సదుపాయాలు కల్పించాలని.. తరువాతే ఇళ్లు ఖాళీ చేయించాలని కోరామని టీడీపీ నేత కిమిడి నాగార్జున అన్నారు. కలెక్టర్‌ను రెండు నెలలు సమయం కావాలని కోరామని తెలిపారు. నాయకుల విజ్ఞప్తిపై కలెక్టర్ సూర్యకుమారి సానుకూలంగా స్పందించి.. ఉన్నతాధికారులతో మాట్లాడి చెబుతామన్నారని కిమిడి నాగార్జున పేర్కొన్నారు.
ఇవీ చదవండి: