ఆక్సిజన్, పడకలు లేక, నిర్ధరణ పరీక్షల ఫలితాలు సకాలంలో రాక ప్రజలు మరణిస్తుంటే.. కనీస బాధ్యత లేకుండా ప్రభుత్వం వాలంటీర్లకు సన్మాన సభలు నిర్వహించడంపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా సాలూరులోని ఆమె నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి వచ్చిన వాలంటీర్లు, వారి కుటుంబసభ్యులకు కరోనా సోకి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. మహారాజ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో చనిపోయారని ఒకరు, మరణాలే లేవని మరొకరు భిన్నవాదనలు వినిపించినా.. కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉందనేది జగమెరిగిన సత్యమన్నారు. వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉన్నా పది, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి చెప్పడం దారుణమని మండిపడ్డారు. వీటి నిర్వహణతో సుమారు 40 లక్షల మందిపై కరోనా ప్రభావం పడుతుందని ఆరోపించారు.
ఇదీ చదవండి: తండ్రి శవంతో రెండు రోజులుగా ఇంట్లోనే చిన్నారి
కరోనా వల్ల 200 మంది కొలువుదీరే శాసనసభ సమావేశాలు వాయిదా వేశారు, 30 మంది దూరంగా కూర్చునే మంత్రివర్గ భేటీ రద్దు చేశారు.. మరి పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఎందుకు వెనక్కి తగ్గడం లేదని సంధ్యారాణి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రులవేనా ప్రాణాలు? విద్యార్థులవి కాదా? అని నిలదీశారు. లక్షల మంది విద్యార్థులు రోడ్లమీదికొస్తే కరోనా సోకదా? వారివి ప్రాణాలుకావా? అని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు పెట్టేందుకు మొండిగా ముందుకు వెళ్లడం విచారకరమన్నారు. ఈ పరీక్షల వల్ల ఎవరైనా కొవిడ్‌తో మరణిస్తే బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఏ భాద్యత తీసుకుందన్నారు. కొవిడ్ ఆస్పత్రుల్లో సౌకర్యాలపై దృష్టిపెట్టకుండా ప్రభుత్వం పరీక్షలు పెడతామనడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రద్దుచేసి, జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండితనానికి పోయి అర్థంలేని నిర్ణయాలు తీసుకుంటే అనర్థాలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేశ్