Maharaja District Hospital: గత నెలలో ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పు, మొన్నటికి మొన్న గుంటూరులో గానగంధ్వరుడు S.P.బాలసుబ్రమణ్యం విగ్రహానికి అవమానం... నేడు విజయనగరం రాజుల దాతృత్వంతో ఏర్పాటైన జిల్లా ఆసుపత్రి పేరు తొలగింపు. ఇలా వైకాపా ప్రభుత్వ హయాంలో మహనీయులకు అవమానాల పరంపర కొనసాగుతూనే ఉంది. మహారాజా జిల్లా వైద్యశాలగా ఉన్న విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి పేరుని.... రాత్రికి రాత్రే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి-జీజీహెచ్గా మార్చేశారు. కొత్త బోర్డును చూసిన రోగులు, విజయనగరం వాసులు నిర్ఘాంతపోయారు. మహారాజా జిల్లా ఆస్పత్రి పేరు మార్పుపై తెలుగుదేశం నేతలు భగ్గుమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఎంతో చరిత్ర ఉన్న ఆస్పత్రి పేరు మార్చడం ఏంటని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ప్రజాప్రయోజన కార్యక్రమాలు చేపట్టిన విజయనగరం రాజుల పేర్లు తొలగించడం హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాజా ఆస్పత్రి పేరు తొలగింపు మరో తుగ్లక్ చర్యగా... తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభివర్ణించారు. నాడు మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం ఛైర్మన్ పోస్టుల నుంచి ఆశోక్ గజపతిని ఇలాగే తప్పించిన అంశాల్లో కోర్టు చీవాట్లు పెట్టినా... వైకాపా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని మండిపడ్డారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై జగన్ వెనక్కి తగ్గాల్సిందేనన్నారు. జగన్ పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరిందని.... తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. మహనీయులను అవమానించి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చి పెద్ద తప్పు చేశారని.... ఇప్పుడు మహారాజా పేరు తీసేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని దుయ్యబ్టటారు.
"జగన్ పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరింది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చి పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు మహారాజా పేరు తీసేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. విజయనగరం నడిబొడ్డున విలువైన భూమిని ఆసుపత్రి కోసం ఇచ్చింది మహారాజ కుటుంబం. దాన్ని కేంద్ర మంత్రిగా నిధులు కేటాయించి అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేసింది అశోక్ గజపతి రాజు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి." - నారా లోకేశ్
ఇవీ చదవండి: