విజయనగరం జిల్లా గుంకలాం లేఅవుట్‌కు చెందిన ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు.. పట్టణంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో అవగాహన సదస్సు జరిగింది. ఇళ్ల నిర్మాణాలపై.. ఇంజనీర్ పి.శ్రీరాములు అవగాహన కల్పించారు. గృహనిర్మాణ సంస్థ, హెబిటేట్ ఫర్ హ్యుమానిటీ ఇండియా ఆద్వర్యంలో ఈ సదస్సు జరిగింది. లబ్ధిదారులు ఫిబ్రవరి మొదటి వారంలోగా తమ ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలని శ్రీరాములు కోరారు. సొంతంగా కట్టుకొనేందుకు ముందుకు వచ్చే వారికి అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తామని అన్నారు.
ప్రతీ ఇంటి నిర్మాణానికి లక్షా 80 వేల రూపాయలను ప్రభుత్వం ఇస్తుందని వెల్లడించారు. లబ్దిదారులు తమ ఆధార్ నెంబరును లింక్ చేసుకున్న ఖాతాల్లో ఈ నగదు నాలుగు విడతలుగా జమ అవుతుందన్నారు. ఇసుకను ఉచితంగా ఇస్తామని, చౌక ధరకే సిమెంటును సైతం అందిస్తామని చెప్పారు. రవాణా భారం పడకుండా కాలనీకి దగ్గరగా ఉండే మార్కెట్ నుంచే సరఫరా చేస్తామని తెలిపారు.
గృహనిర్మాణ సామగ్రిని నచ్చిన చోటు నుంచే లబ్దిదారుడు కొనుక్కొనే వెసులు బాటు కల్పించామన్నారు. నాణ్యతను వార్డు ఎమినిటీస్ సిబ్బంది తనిఖీ చేస్తారని, సాంకేతిక సహకారాన్ని అందజేస్తారని చెప్పారు. ప్రభుత్వం నిర్ధేశించిన నమూనాలోనే ఇంటి నిర్మాణాన్ని చేసుకోవాలని, తప్పనిసరిగా ఒక లివింగ్ రూమ్, బెడ్ రూము, కిచెన్, టాయిలెట్ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. తమ వ్యక్తిగత నమ్మకాన్ని బట్టి వాస్తును పాటించుకోవచ్చని సూచించారు.
ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన తరువాత లబ్ధిదారులతో కలిపి ఫొటో తీసి జియో టాగింగ్ చేయాలని చెప్పారు. ఇళ్లు తప్పనిసరిగా కట్టుకున్నవారికి మాత్రమే బిల్లులు మంజూరవుతాయని ఆయన స్పష్టం చేశారు. సుమారు 12,300 మంది లబ్దిదారులు ఉన్న గుంకలాం లేఅవుట్... భవిష్యత్తులో ఒక చిన్న నగరంగా మారబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా గృహనిర్మాణ సంస్థ పీడీఎస్‌వి రమణమూర్తి, మున్సిపల్ సహాయ కమిషనర్ ప్రసాదరావు, డీఈలు, ఏఈలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: