పోగొట్టుకున్న డబ్బును ఎలాగైనా రాబట్టుకొనేందుకు ఓ ఆర్మీ జవాను మావోయిస్టు అవతారం ఎత్తాడు. వెబ్ సిరీస్‌లు చూసి తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఓ బంగారం వ్యాపారి నుంచి డబ్బులు వసూలు చేస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్పీ రాజకుమారి ఆదివారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పార్వతీపురం మండలం చినబంటువానివలసకు చెందిన చందనాపల్లి రాజేశ్వరరావు ఉత్తర్‌ప్రదేశ్‌లో జవానుగా పని చేస్తున్నాడు.
గతంలో భూ లావాదేవీల వ్యవహారంలో సుమారు రూ.22 లక్షలు నష్టపోయాడు. వాటిని తిరిగి సంపాదించాలనే లక్ష్యంతో 45 రోజుల సెలవులో స్వగ్రామం వచ్చాడు. కొన్ని వెబ్ సిరీస్‌లు చూసి ప్రేరణ పొంది ఉత్తర్‌ప్రదేశ్‌లోనే రూ.30 వేలకు తుపాకీ కొన్నాడు. మావోయిస్టుగా నమ్మించి ఈ నెల 3న అలమండ ప్రాంతంలో ఇద్దరు వాహన చోదకుల్ని బెదిరించి ఫోన్లు లాక్కున్నాడు. 6న బంగారం వ్యాపారి బాబు ఇంట్లో మూడు సార్లు గాలిలో కాల్పులు జరిపి వెళ్లిపోయాడు. తర్వాతి రోజు ఫోన్ చేసి తాను మావోయిస్టు కమాండర్‌నని.. ప్రాణాలతో ఉండాలంటే రూ.5కోట్లు ఇవ్వాలని బెదిరించాడు.
రూ.కోటిన్నర మాత్రమే ఇవ్వగలనని వ్యాపారి చెప్పడంతో నగదు తీసుకొని కొండ ప్రాంతానికి రావాలని చెప్పాడు. బాబు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆదివారం వ్యాపారిని నకిలీ నోట్లతో పంపించి కొండల మధ్య మాటు వేశారు. డబ్బులు తీసుకొనేందుకు రాజేశ్వరరావు రాగానే అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి తుపాకీ, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.
ఇవీ చూడండి...