Somu Veerraju: అమరావతిలో కేంద్రరంగ సంస్థలు ఏర్పాటు చేశామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం లైన్ కల్యాణ మండపంలో భాజపా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బూత్, శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జాతీయ రహదారులను కేంద్రం నిర్మాణం చేస్తుంటే రాష్ట్రం ఏంచేస్తోందని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చినా నిర్మించలేకపోతున్నారని విమర్శించారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో 30 శాతం ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులు, ప్రభుత్వం కలిసి కుట్రపన్నారని మండిపడ్డారు. ఒకే వేదికపై మంత్రి కొడాలి నానితో చర్చకు సిద్ధమని తెలిపారు. ఈ రెండేళ్లలో ప్రతి ఒక్కరూ గడపగడపకు వెళ్లి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి వెళ్లి ఆ ప్రాంత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులు సోము వీర్రాజుకి సన్మానం చేశారు.
ఇదీ చదవండి: చెత్తపన్ను చెల్లించలేదని కర్నూలు నగరపాలకసంస్థ సిబ్బంది నిర్వాకం..!