బస్,రైల్వే స్టేషన్లు కిటకిట పండగను సొంత ఊరిలో చేసుకోవాలనే తపనతో ఆర్టీసీ కాంప్లెక్స్‌లను, రైల్వే స్టేషన్లకు పోటెత్తుతున్నారు. దసరా సెలవులు కావటంతో ఆర్టీసీ బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పొట్టకూటి కోసం వలస వెళ్లిపోయిన వారు స్వగ్రామాల్లో నిర్వహించే దసరా ఉత్సవాల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తున్నందున విజయనగరం బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఏ బస్సు చూసినా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రద్దీ మరీ ఎక్కువగా ఉంది. ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దసరా పూర్తైనా వారం రోజుల వరకూ ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు పార్వతీపురం డిపోలో ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి : దసరా వచ్చిందయ్యా... సరదా తెచ్చిందయ్యా..!