విజయనగరం జిల్లా బుడతనపల్లికి చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి అంతిమ సంస్కారం వినూత్నంగా జరిగింది. బతికున్నప్పుడు... ఎప్పుడూ ప్రకృతి, పచ్చదనం అంటూ వెంపర్లాడిన ప్రకృతి ప్రేమికుడికి అదే మొక్కలతో ఘనమైన, నిజమైన నివాళి అందింది.
ప్రకృతి ప్రేమికుడిగా...
రిటైర్డ్ ఉపాధ్యాయుడు సన్యాసి... ప్రకృతి ప్రేమికుడు. గ్రామ సర్పంచిగా కొనసాగిన సమయంలో గ్రామ పరిధిలోని బంజరు భూములు, చెరువు గట్లమీద 300లకు పైగా వివిధ రకాల మొక్కలను నాటి వాటిని స్వయంగా రక్షించాడని గ్రామస్థులు తెలిపారు. వాటి ద్వారా ప్రస్తుతం గ్రామ పంచాయతీకి ఆదాయం సైతం సమకూరుతోందన్నారు.
చివరి కోరిక....
కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రకృతి ప్రేమికుడు సన్యాసి... తాను మరణించిన రోజు మొక్కలు నాటాలని కుటుంబ సభ్యులను, మిత్రులను, విద్యార్థులను కోరాడు. ఆయన తుదిశ్వాస విడువగా.. చివరి కోరిక మేరకు అందరూ కలిసి అంతిమ సంస్కారాల్లో పాల్గొని... స్మశాన వాటికలో మొక్కలు నాటారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్థులు ప్రకృతిపై సన్యాసికి ఉన్న ప్రేమను కొనియాడారు. ఆయన చివరి కోరికను తీర్చిన బంధుమిత్రులను, గ్రామస్థులను అభినందించారు.