విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని(ఆర్‌బీకే) ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. రైతు ముంగిట్లోకే అన్ని సదుపాయాలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో...ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. వీటి ద్వారా రానున్న రోజుల్లో వ్యవసాయరంగం రూపురేఖలు మారిపోనున్నాయని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలతో...ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు.
అంతకుముందు ఆర్‌బీకే ఆవరణలో ప్రకృతి సేద్యం, ఆగ్రోస్, పౌర సరఫరా, రైతు శిక్షణా కేంద్రం, భూసార పరీక్షా కేంద్రం, వ్యవసాయ మార్కెటింగ్, ఉద్యాన, మత్స్య, పశు సంవర్థకశాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి పుష్పశ్రీవాణి పరిశీలించారు. అనంతరం రాష్ట్ర రాజధాని నుంచి సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఏడాది పాలన విప్లవాత్మకం
ప్రజలకు ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే సీఎం జగన్ నెరవేర్చారన్నారు. ఆయన ఏడాది పాలన విప్లవాత్మకమని కొనియాడారు. సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా సీఎం జగన్ నిలిచారని, నవశకాన్ని సృష్టించారని ప్రశంసించారు. మేనిఫేస్టోను శతశాతం అమలు చేసిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కిందన్న మంత్రి... పార్టీ మేనిఫెస్టో ఆయనకు ఒక పవిత్ర గ్రంథమని పేర్కొన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని ముఖ్యమంత్రి లభించడం రాష్ట్ర అదృష్టమని తెలిపారు. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనను మరిపించి, తండ్రిని మించిన తనయుడిగా జగన్ మోహన్‌రెడ్డి పేరుగాంచారని ప్రశంసించారు.
ఆర్బీకేల ద్వారా గ్రామాల్లోనే వ్యవసాయ,అనుబంధ శాఖల కార్యక్రమాలన్నీ రైతులకు అందుబాటులోకి వస్తాయన్నారు. జిల్లాలో 624 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని... ఇవి రైతు ప్రగతికి సోపానాలు కానున్నాయని అన్నారు. వీటన్నింటికీ త్వరలో శాశ్వతంగా సొంత భవనాలను నిర్మిస్తున్నామని మంత్రి పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఎంతటి వారైనా సహించేది లేదు...