రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగుల ఆశలపై నీరు చల్లిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రొటెం స్పీకర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖలలో ఉన్న ఖాళీల భర్తీ కోరుతూ.. నూతన జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వారి ఆశలకు అనుకూలంగా జాబ్ క్యాలెండర్ వచ్చే వరకు తమ సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతామని బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అవసరమైతే తనకున్న అధికారాన్ని సైతం ఉపయోగిస్తానన్నారు. స్థానిక జెడ్పీ మినిస్ట్రియల్ భవనంలో డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ మణికంఠ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.
వాస్తవానికి రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు, జాబ్ క్యాలెండర్లో ప్రభుత్వం చూపిన ఖాళీల లెక్కలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. రాష్ట్రంలో 6500 పోలీసులు ఖాళీలు, 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టులు భర్తీని పక్కకు పెట్టి తక్కువమంది పోటీపడే యూనివర్సిటీలోని ఉద్యోగాలు, డాక్టర్లు పోస్టులు భర్తీ చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయలో ఇప్పటికే భర్తీ చేసిన మహిళ పోలీసులు ఉన్నారని.. వారు కూడా పోలీసులు శాఖలో భాగమని కొత్త పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. అలాగే ఎయిడెడ్ విద్యా సంస్థలు మూతపడతాయి కాబట్టి ఆ పోస్టులు అదనంగా వస్తాయని లెక్కలు వేసుకునే పనిలో ప్రభుత్వం ఉందన్నారు.
'ప్రభుత్వం పోస్టులు భర్తీ చేసే విషయంలో మీనామేషాలు లెక్కిస్తుందన్నారు. మీ పోరాటం ఫలితంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అందరం కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. దీంతో ప్రభుత్వం నూతన జాబ్ క్యాలెండర్ ఇచ్చే విషయంలో పునరాలోచనలో పడింది. నిరుద్యోగుల ఆశలకు అనుకూలంగా జాబ్ క్యాలెండర్ వచ్చేవరకు నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలకు అండగా ఉంటాం. అవసరమైతే నాకున్న ప్రొటెం స్పీకర్ అధికారాన్ని సైతం ఉపయోగిస్తాం' అని బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఈ నిరుద్యోగ సదస్సులో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిరసనలు..
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై నిరాశకు గురైన నిరుద్యోగులు తమ నిరసనను ప్రభుత్వానికి బలంగా తెలియజేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా యువజన, విద్యార్థి సంఘాలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సాధన సమితిగా ఏర్పడ్డాయి. ప్రభుత్వం వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను చూపించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు, రాస్తారోకోలు చేపట్టారు.
ఇదీ చదవండి..
kollu arrest: మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం.. కొల్లు రవీంద్ర అరెస్ట్!