Police Notice to Ashok Gajapathiraju: రామతీర్థం ఘటనపై మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుకు పోలీసులు సెక్షన్ 41 నోటీసును అందజేశారు. ఆయన ఇంటికి వచ్చి నోటీసు ఇచ్చారు. కోర్టు పిలిచినప్పుడు విచారణకు రావాలని అశోక్‌కు పోలీసులు సూచించారు. రామతీర్థం ఘటనపై నిన్న అశోక్‌పై 34, 353,427 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కాగా పోలీసుల నోటీసుపై అశోక్ గజపతిరాజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అశోక్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఇదీ జరిగింది..
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బోడికొండపై బుధవారం కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రొటోకాల్ పాటించలేదని ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కొండపై బుధవారం ఉదయం శంకుస్థాపన పూజలు చేసేందుకు నిర్ణయించారు. గజపతిరాజు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. ఆలయ ధర్మకర్తగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. కనీసం తేదీలు నిర్ణయించే ముందు చెప్పలేదన్నారు. ఈ క్రమంలో ఆలయ సిబ్బంది తీసుకొస్తున్న శిలాఫలకాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. అధికారులు, అక్కడున్న వారు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయానికి ప్రభుత్వం ఎలా శిలాఫలకం ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. ఆనవాయితీకి వ్యతిరేకంగా, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడ్డారు. అమరావతి రైతుల మాదిరిగానే ప్రభుత్వం తనను కూడా వేధిస్తోందన్నారు. అశోక్ గజపతిరాజుకు ఆలయ ధర్మకర్తగా గౌరవం ఇచ్చామని, ఈవో, ప్రధాన అర్చకులు వెళ్లి ఆహ్వానించారని విలేకరులతో దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలకం చేయించామని, ఆలయాన్ని పునర్నిర్మించడం ఆయనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గంట ముందే వెళ్లి వీరంగం సృష్టించారని ఆరోపించారు. ఆలయాభివృద్ధికి ఆయన ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రామాలయం సాక్షిగా అశోక్ నిజస్వరూపం బయటపడిందని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి :