విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం మర్రివలసలో "వై.ఎస్.ఆర్.జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష" కార్యక్రమానికి రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి భూమిపూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. డ్రోన్ టెక్నాలజీతో గ్రామానికి సంబంధించి తీసిన ఛాయాచిత్రాలను మంత్రులు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చినప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్యలతో కలసి తిలకించారు. భూముల సర్వేలో భాగంగా వినియోగించే కోర్స్ రోవర్స్, డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం, ఇటీఎస్ పరికరాలను తిలకించారు. ఆ యంత్ర పరికరాలు భూ సర్వేలో ఏ విధంగా ఉపయోగపడనున్నాయో సంయుక్త కలెక్టర్ కిషోర్ కుమార్ వివరించారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ.. బ్రిటిష్ హయాంలో భూసర్వే జరిగిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు మళ్లీ జరగలేదని, దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం సుమారు 1000 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును 2023 అక్టోబరు నాటికి పూర్తిచేయడానికి గడువుగా నిర్ణయించామన్నారు. పటిష్టమైన రీతిలో సర్వే జరిగేందుకే మూడేళ్ల కాలవ్యవధిని నిర్ణయించామన్నారు.
సర్వే ఆఫ్ ఇండియా అందించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్లను వినియోగించి భూముల ఛాయాచిత్రాలు తీసి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఎంతో కచ్చితంగా భూముల హద్దులను నిర్ణయిస్తారని చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్న కారణంగా పొరపాట్లకు ఆస్కారం లేకుండా సర్వే జరుగుతుందన్నారు. ఈ సర్వేపై రైతుల్లో ఉన్న అపోహలను, అనుమానాలు నివృత్తి చేసేందుకు గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. గ్రామాల్లో ఈ సర్వే జరుగుతున్న సమయంలో రైతులంతా భాగస్వాములై సిబ్బందికి సహకరించాలని సూచించారు.
అనంతరం మంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ... తల్లికి బిడ్డపై ఎంతటి మమకారం ఉంటుందో రైతుకు కూడా తన భూమిపై అంతటి మమకారం ఉంటుందని, అటువంటి భూమి ఇతరుల పాలైతే ఎంతో మనోవ్యధ చెందుతారని పేర్కొన్నారు. అలాంటి భూములకు మరొకరు తప్పుడు రికార్డులతో వివాదాలు సృష్టిస్తున్న పరిస్థితుల్లో రైతులు కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితి ఉంది. ఈ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ సమగ్ర భూసర్వేకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... AP Jobs: జాబ్ క్యాలెండర్ విడుదల.. ఇకనుంచి ఇంటర్వ్యూలు లేవ్!