విజయనగరం జిల్లాలో ఖరీఫ్‌లో 3 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగైంది. సన్న రకాల వంగడాలను ప్రోత్సహించే క్రమంలో.. ఆర్బీకే ద్వారా రైతులకు విత్తనాలు అందించింది. వీటిల్లో 1224 కొత్త వరి వంగడం..మంచి దిగుబడి వస్తుందని చెప్పడంతో చాలా మంది రైతులు.. కొత్త రకాన్ని సాగు చేశారు. పంట ఆశాజనకంగా ఉండటంతో.. 60 వేల టన్నుల దిగుబడి వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. నాడు నమ్మించిన అధికారులే రైతుల్ని నట్టేట ముంచే పరిస్థితి నెలకొంది. ఆర్బీకేలకు ధాన్యం తీసుకెళ్తే.. ఈ రకం అప్పుడే కొనుగోలు చేయబోమని సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు మిల్లర్లూ ఆసక్తి చూపటం లేదు. ఫలితంగా పంటను అమ్ముకోవడానికి రైతులు... అధికారులు, మిల్లర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
వేలాది రూపాయలు అప్పులు చేసి.. సాగు చేసిన పంట చేతికొచ్చి నెలరోజులవుతున్నా.. రైతు గడప దాటని పరిస్థితి. వరుస విపత్తులకు కొంత మేర పంట దెబ్బతినగా.. నిల్వ కారణంగానూ అన్నదాతలు నష్టపోతున్నారు. ఆర్బీకేల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో చాలా మంది కల్లాల్లోనే ఉంచేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వీలైనంత త్వరలో సన్నరకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అంటున్నారు. అధికారులు సత్వర చర్యలు తీసుకుని సన్నరకాల కొనుగోళ్లు చేపట్టాలని ఆరుగాలం శ్రమించిన రైతులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: Gudivada Casino Controversy: రేపు గవర్నర్ వద్దకు తెదేపా నిజనిర్ధరణ కమిటీ