Garbage tax: చెత్త పన్ను కట్టలేదని ఓ బహుళ అంతస్తుల భవనం ముందు వ్యర్థాలను పారబోశారు విజయనగరం నగరపాలక సంస్థ సిబ్బంది. దీనిపై అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి వివరాల మేరకు.. స్థానిక ఒకటో డివిజన్ పరిధిలోని అయ్యప్పనగర్‌లో సాయి అమృతా రెసిడెన్సీ వాసులు పన్ను కట్టడం లేదని కొన్నిరోజులుగా పారిశుద్ధ్య సిబ్బంది చెత్త తీసుకెళ్లడం లేదు. ఇక్కడ 30 కుటుంబాలు ఉంటున్నాయి. దీంతో వారు చెత్తను సమీపంలోని కుండీలో వేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం పారిశుద్ధ్య మేస్త్రీ మణికంఠ.. సిబ్బంది సహకారంతో చెత్త, వ్యర్థాలను తీసుకెళ్లి అపార్ట్‌మెంటు గేటు వద్ద పారబోశారు.
దీన్ని ప్రశ్నించినందుకు సిబ్బందితో పాటు పలువురు వైకాపా నాయకులు తమపై దాడి చేశారని, సెల్‌ఫోన్‌లో దృశ్యాలను చిత్రీకరిస్తుండగా.. లాక్కొని పగులగొట్టారని అపార్ట్‌మెంట్ కార్యదర్శి యూఎస్.రవికుమార్ తెలిపారు. దీనిపై సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి.రమణ, ఇతర నాయకులతో కలిపి ఆందోళనకు దిగారు. ఈ విషయంపై నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్.శ్రీరాములునాయుడును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. సదరు నివాసదారులు నవంబరు నుంచి పన్ను కట్టడం లేదని, కావాలనే రహదారులపై చెత్త వేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పారిశుద్ధ్య సిబ్బంది అదే చెత్తను తీసుకెళ్లి అపార్ట్‌మెంట్ ముందు వేశారన్నారు.
ఇవీ చదవండి: