రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స ఆదిబాబు తమ భూమిని కబ్జా చేస్తున్నారని విజయనగరం ప్రదీప్ నగర్లోని సత్యసాయి లే ఔట్ కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. కరోనా ఆంక్షల కారణంగా లే ఔట్లోనే ఆక్రమణదారులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆక్రమణదారులు ఏర్పాటు చేసిన కంచె, స్తంభాలను కూల్చివేశారు.
ఎన్నో ఏళ్లుగా శ్రమించి దాచుకున్న సొమ్ముతో ప్రదీప్ నగర్లోని సత్య సాయి నగర్ లే ఔట్లో ఫ్లాట్లు కొనుగోలు చేశాం. అయితే వాటిని మంత్రి బొత్స సోదరుడు ఆదిబాబు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. దీనిపై గతంలో హైకోర్టులో పిటిషన్ వేసి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. అయినా ఆక్రమణకు పాల్పడుతున్నారు. మాకు అన్ని పత్రాలు, అనుమతులు ఉన్నా మా స్థలాల చుట్టూ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స ఆదిబాబు ప్రహరీలు నిర్మించారు -ఓ బాధితుడి ఆవేదన
నగరం నడిబొడ్డున ఉన్నందున కోట్ల రూపాయలు వస్తాయన్న ఆశతో భూ ఆక్రమణకు పాల్పడుతున్నారు. 2019 డిసెంబర్లో ఒకసారి కబ్జా చేయడానికి ప్రయత్నించారు. వెంటనే కోర్టులో కేసు వేసి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం. అయినప్పటికీ మా స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు- మరో బాధితుడు
సమస్యను తీర్చాల్సిన నాయకులే ఇబ్బందులు సృష్టిస్తే మా గోడు ఎవరికి చెప్పుకోవాలి. నాయకుల చర్యల కారణంగా మేము ఆర్థికంగా నష్టపోయి, కుటుంబాలు వీధిలో పడే పరిస్థితులు ఏర్పడ్డాయి- ఓ బాధితురాలు
ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.