CM Chandrababu Met Central Ministers : వ్యవసాయానికి జీవనాధారమైన సాగునీటికి నదులు అనుసంధానమే ఏకైక పరిష్కార మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గోదావరి- కృష్ణా- పెన్నా నదుల అనుసంధానంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోనున్నాయని దీనికి కేంద్రం ఆర్థికంగా అండగా నిలబడాలని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను ఆయన కోరారు. అలాగే దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ సంస్థలను ఏపీకి పంపాలని జైశంకర్‌ను కలిసి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రం అప్పు 9.74 లక్షల కోట్లు - ఎవరైనా కాదంటే రండి తేల్చుతా : సీఎం చంద్రబాబు
గోదావరి- కృష్ణా- పెన్నా అనుసంధానమే లక్ష్యం : కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌ను ఏపీలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనివల్ల రాష్ట్ర రూపురేఖలే మారిపోనున్నాయని చంద్రబాబు అన్నారు. గోదావరి-కృష్ణా-పెన్నాలను అనుసంధానించి ఏపీని కరవు రహితంగా మారుస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానానికి కేంద్రం సాయం చేస్తున్నట్లుగానే ఏపీకి సహకరించాలని నిర్మలాను కోరారు. ప్రస్తుతం పోలవరం ద్వారా గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు తెస్తున్నామని అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడికాల్వలోకి ఎత్తిపోసి బనకచర్ల మీదుగా రాయలసీమకు తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు. 60 వేల కోట్ల వరకు ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్ కు కేంద్రం సహకరించాలని చంద్రబాబు కోరగా నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
'రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉంది - ఐదేళ్లూ అడవి పందుల తరహాలో మేశారు'
ఏపీలో విదేశీ సంస్థల పెట్టుబడులు : అనంతరం మరో కేంద్రమంత్రి జైశంకర్‌తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రభావం దేశంపై ఏవిధంగా ఉండబోతుందని చర్చించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని కోరారు. దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలను ముందుగా ఏపీకి తీసుకురావాలని చంద్రబాబు కోరినట్లు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు.