ప్రజల భూములకు శాశ్వత హక్కు, రక్షణ కల్పించడానికే భూ రీసర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని, దీంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బొండపల్లి మండలం తమటాడలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న భూరీసర్వే కార్యక్రమాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. పాదయాత్రలో భూ సమస్యలు విన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ సర్వే పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలను ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఇచ్చామన్నారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎమ్మెల్సీ సురేష్‌బాబు, సంయుక్త కలెక్టర్ కిషోర్‌కుమార్, సబ్‌కలెక్టర్ విధేఖరే, ఆర్డీవో భవానీశంకర్, ఉప కలెక్టర్ బాల త్రిపురసుందరీదేవి, మండల ప్రత్యేకాధికారి జి.నాగమణి, సర్వే అండ్ ల్యాండ్ శాఖ ఏడీ పాలరాజు, తహసీల్దారు ఎన్.సీతారామరాజు, ఎంపీడీవో త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు.
అధికారులపై మంత్రి ఆగ్రహం
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని ఇరిగేషన్ అధికారులపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని, రెండు రోజుల్లో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులపై ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఎంతో సానుకూలంగా ఉన్నప్పటికీ.. ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి గతంలో తన హయాంలోనే సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయని, గత ప్రభుత్వ హయాంలో మరో 12 శాతం జరిగాయని గుర్తు చేశారు. మిగిలినవి ఎప్పటికి పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు విషయంలోనూ నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.