ఉత్తరాంధ్ర ప్రాంతంలో వలసలకు పెట్టింది పేరు విజయనగరంజిల్లా. రాష్ట్రంలోనే కాదు., బెంగళూరు, చెన్నై, హైదరబాద్ వంటి పట్టణాల్లో సైతం ఈ ప్రాంత వాసులు వలస కూలీలు ఎక్కువగా ఉంటారు. భవనం నిర్మాణ పనులు నుంచి మార్కెట్లలో కూలీలు, హోటళ్లు, దుకాణాల్లో చిన్నచితక పనులు, కాపలదారుల వరకు వీరుంటారు. ఇక తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు చెన్నై, గుజరాత్ బాట పడతారు. బతుకుదెరువుకు పొట్ట చేతపట్టుకుని పోవటంతో... పల్లెలన్నీ బోసిపోయాయి. పార్వతీపురం, బొబ్బిలి, కొమరాడ, బాడంగి, తెర్లాం, మక్కువ, సాలూరు, రామభద్రపురం, గరివిడి, గుర్ల, జామి మండలాలతో పాటు.. తీరప్రాంతాలైన భోగాపురం, పూసపాటిరేగ మండలాలోని మత్య్సకారులు 90శాతం మంది ఇతర ప్రాంతాలకు వలస పోతారు. ఈ గ్రామాలోకి వెళ్లిన వారికి., వృద్ధులు, చిన్నారులే దర్శనమిస్తారు. కొన్ని పలెల్లో తాళాలు వేసిన గృహాలే పలకరిస్తాయి. ఇవి కరోనా మహమ్మారికి ముందు పరిస్థితులు. కొవిడ్-19 వైరస్ వ్యాప్తితో...ఆ పల్లెల ముఖచిత్రం మారిపోయింది. కరోనా నేర్పిన పాఠాలు., చవిచూసిన కష్టాలతో వలసజీవులందరూ స్వస్థలాల బాట పట్టారు. దీంతో...గ్రామాలు కళకళలాడుతున్నాయి. మొన్నటి వరకు వీధికి ఒక్కరూ ఇద్దరు ఉన్న ప్రాంతాలు., ఇప్పుడు జనవాసాలుగా మారిపోయాయి. ప్రతి ఇళ్లు., కుటుంబ సభ్యులతో నిండిపోయింది. ముసలి, ముతక, పిల్లా పెద్దల ముచ్చట్లతో రచ్చబండలు తిరిగి కొలువుదీరాయి.
వలసజీవులు తిరిగి రావటంతో పల్లెలు నిండుగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడే ఏదోక చిన్నపాటి పని చేసుకుని పిల్లాపాపలతో కలిసి ఉంటామంటున్నారు. ఎక్కడో దిక్కుమొక్కు లేకుండా చావటం కంటే...ఊళ్లోనే ఉండటం ఉత్తమమని కూలీలు అంటున్నారు. ఇప్పటికే వలసకూలీలు పనులు వెతుక్కుంటున్నారు.
ఇదీచూడండి. ఇళ్ల గోడల నుంచి ఇంకా స్టైరీన్ వాసన!