విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం జరాజపుపేటలో కొవిడ్ బాధితులను మున్సిపల్ చెత్త తరలించే ఆటోలో ఆసుపత్రికి తరలించిన ఘటనపై జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. జనసేన పార్టీ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా మోకాళ్ళపై నిరసన నిర్వహించారు.
ప్రభుత్వం కరోనా రోగుల పట్ల మానవత్వంతో మెలగాలని పదేపదే చెబుతున్నా అవి కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని, అధికారులు ఆచరించకపోవడం శోచనీయం అని అన్నారు. చెత్త ఆటోలో కరోనా బాధితులను తరలించడాన్ని జాతి యావత్తు తలదించుకునేలా చేసిందని అన్నారు. దీనికి కారణమైన నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్ జే.ఆర్. అప్పలనాయుడును సస్పెండ్ చేయాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు.
కరోనా బాధితులను జంతువుల్లా చూస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. కరోనా బాధితులకు ప్రభుత్వం చెబుతున్నట్లు మంచి భోజనం, మౌళిక సదుపాయాలు కల్పించాలని లేదంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి రూ. 44.85 కోట్లతో వట్టిగడ్డ ప్రాజెక్టు ఆధునీకరణ పనులు