కొత్త జిల్లాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. పార్వతీపురం కొత్త జిల్లాగా ఏర్పాటవుతుందనే విషయంలో స్పష్టత వచ్చింది. మరో రెవెన్యూ డివిజనును ఏర్పాటు చేయాలనే డిమాండు విజయనగరం జిల్లాలో తీరనుంది. బొబ్బిలి కొత్త డివిజనుగా, పార్వతీపురం జిల్లా కేంద్రంగా మారేందుకు వీలుంది.
అంతా అనుకూలమే..:
పార్వతీపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి ప్రధానంగా కలెక్టరు కార్యాలయం, పోలీసు కార్యాలయం, జిల్లా న్యాయస్థానం తక్షణం ఏర్పాటుకు ఉన్న వనరులను గుర్తించాల్సి ఉంటుంది. పార్వతీపురంలో ఈ మూడు అవసరాలు తీరేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. ఐటీడీఏ కార్యాలయానికి కొత్తగా రూ.ఐదు కోట్లతో నిర్మిస్తున్న భవనాన్ని కలెక్టరు కార్యాలయానికి కేటాయించనున్నారు.
వైకేఎం కాలనీలోని వైటీసీని జిల్లా పోలీసు కార్యాలయంగా వినియోగించేందుకు పరిశీలిస్తున్నారు. పోలీసు అధికారులు ఇప్పటికే ఒకటికి పదిసార్లు ఈ కేంద్రాన్ని సందర్శించి అనుకూల ప్రతికూలతలపై సమాచారాన్ని సేకరించారు. జిల్లా కోర్టు నడిపించేందుకు అవసరమైన భవన వసతి కూడా పార్వతీపురంలో ఉంది. ఇప్పటికే అదనపు జిల్లా జడ్జి కోర్టు ఇక్కడ నడుస్తోంది. అందువల్ల ఈ మూడు అంశాల్లో సానుకూల పరిస్థితి ఉంది. ఇతర శాఖల కార్యాలయాలను ఒకే చోట సముదాయంగా నిర్మించేందుకు యాభై ఎకరాల స్థలాన్ని సేకరించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
కల తీరుతుంది:
బొబ్బిలి కేంద్రంగా పోలీసు డివిజను ఉన్నప్పటికీ రెవెన్యూ డివిజను ఏర్పాటు కల తీరనుందంటున్నారు. బొబ్బిలిలో కొన్ని డివిజను కార్యాలయాలు ఉన్నాయి. విద్యాశాఖ, విద్యుత్తు, నీటిపారుదల శాఖలు, తూనికలు కొలతల శాఖలకు బొబ్బిలే ప్రధాన కేంద్రం. జిల్లాలో మూడో డివిజను కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. చీపురుపల్లి, బొబ్బిలి ఈ రెండింటిలో ఎక్కడనే అంశంపై ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ వచ్చారు.చివరకు బొబ్బిలి రెవెన్యూ డివిజనుగా ఆవిర్భవించేందుకు వీలుగా ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులు దోహదపడనున్నాయంటున్నారు.
రామభద్రపురం ఔట్!:
సాలూరు సర్కిల్ పరిధిలో ఉన్న రామభద్రపురం మండలం పార్వతీపురం పోలీసు సబ్‌డివిజను పరిధిలో ఉంది. బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న మండలాలు అదే డివిజనులో చేరనుండటంతో పోలీసు డివిజన్లను కూడా పునర్వ్యవస్థీకరించాలి. దీంతో రామభద్రపురం పాలనాపరంగా బొబ్బిలి డివిజనుకు మారిపోతుంది. సాలూరు సర్కిల్‌లో మక్కువ, సాలూరు, పాచిపెంట మాత్రమే ఉంటాయి.
జామి పరిస్థితి ఏమిటో...?:
జిల్లాల ఏర్పాటుతో జామి మండలం భవిష్యత్తు డైలమాలో పడింది. ఇది మండల కేంద్రంగా ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని పునర్వ్యవస్థీకృతమయ్యే విజయనగరం, విశాఖ జిల్లాలు పంచుకుంటాయి. రెండుగా విడిపోతే మండలం అస్తిత్వం ప్రశ్నార్థకమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: