సుశీల్ కుమార్, యోగేశ్వర్ , సాక్షిమాలిక్, బజరంగ్ పూనియా.. వీరంతా గత కొంత కాలంగా ఒలింపిక్స్‌లో దేశ పతకాన్ని రెపరెపలాడిస్తున్న రెజ్లింగ్ క్రీడాకారులు. మొదట్లో ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన ఈ క్రీడ.. ప్రస్తుతం మన రాష్ట్రంలోనూ ఊపందుకుంటోంది. విజయనగరంలో జరిగిన 8వ రాష్ట్ర సీనియర్ పురుషులు, మహిళల రెజ్లింగ్ ఛాంపియన్ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి 300మంది క్రీడాకారులు తరలిరావటం ఇందుకు నిదర్శనం. రెండు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో పురుషులతో పాటు.. మహిళా క్రీడాకారులు సై అంటే సై అంటూ సత్తా చాటారు.
కుస్తీ పోటీల్లో గ్రామీణ యువతీ యువకులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. క్రీడా సంఘాలు అంతే స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాయి. ఉచిత శిక్షణతోపాటు దాతల సహకారంతో పోటీలు నిర్వహిస్తున్నాయి. కానీ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని నిలిపేందుకు ఈ ప్రోత్సహం ఏ మాత్రం సరిపోవడం లేదన్నది క్రీడాకారుల మాట. ప్రభుత్వం స్పందించి క్రీడాకారులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఒలింపిక్స్‌లో పతకాలు ఖాయమంటున్నారు.
కుస్తీ పేరుతో ప్రాచుర్యం పొందిన మల్లయుద్ధం అత్యంత శ్రమతో కూడుకున్నది. ఇందులో పాల్గొనే క్రీడాకారులు సరైన పోషక పదార్థాలను తీసుకోవాలి. లేదంటే ఇది ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. అదేవిధంగా రెజ్లింగ్ క్రీడలో మ్యాట్ ప్రధాన వనరు. ప్రాక్టీస్ చేసేందుకు వినియోగించే మ్యాట్ విలువ సుమారు 5లక్షల రూపాయలు. ప్రస్తుతం రాష్ట్రంలో మ్యాట్ కొరత క్రీడాకారులను వేధిస్తోందని కోచ్‌లు చెబుతున్నారు. ఈ ఏడాది జులైలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెజ్లింగ్ అకాడమీ రాష్ట్రానికి వస్తే.. ఈ సమస్యలు కొంత వరకు తీరుతాయని క్రీడాసంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: వైకాపా దుర్మార్గాలను అడ్డుకునేందుకు.. ప్రజామద్దతు కావాలి : చంద్రబాబు