విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని వంగపల్లి పేటకు చెందిన రెడ్డి లక్ష్మీనాయుడు.. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేశారు. అలా సాఫీగా సాగిపోతున్న లక్ష్మునాయుడు జీవితంలో కరోనా విలయ తాండవం చేసింది. కొవిడ్ దెబ్బకు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగం పోయింది.
'కరోనా వ్యాధి నేపథ్యంలో మే వరకు మమ్మల్ని కొనసాగించారు. తర్వాత మాకు ఇచ్చిన ల్యాప్టాప్ లాంటివి వెనక్కు తీసుకున్నారు. ఇకపై జీతాలు ఇవ్వలేమని మమ్మల్ని పంపించారు. ఇక్కడే కాదు.. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లోని సుమారు 250మంది ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. సుమారు జూన్ నుంచి మాకు జీతాల్లేవు. బతకడం చాలా ఇబ్బందిగా మారింది.
కుటుంబాన్ని పోషించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాం. నేనే ప్రతి ఒక్కరిని ఏదైనా పని ఉందా అంటూ.. అడుగుతున్నా. ఓ తాపీ మేస్త్రి దగ్గర పని చేస్తున్నా. రోజుకి 300 రూపాయలు కూలి. ఇంతకుముందు ఇటువంటి బరువులు మోయడం అలవాటు లేకపోవడంతో చాలా కష్టంగా ఉంది. మమ్మల్ని పనికి కూడా ఎవరూ పిలవట్లేదు. వర్షాలు పడితే ఈ భవన నిర్మాణ పని కూడా ఉండటం లేదు. పొలం పనులకు వెళ్తున్నా.
ట్రిపుల్ ఐటీ వాళ్లు సగం జీతం అయినా ఇవ్వడం లేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. సుమారు 250 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. మా కుటుంబాల బాధను చూసి న్యాయం చేయాలి.' అని రెడ్డి లక్ష్మీనాయుడు తన ఆవేదనను చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: 17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్