నగర పాలక సంస్థగా ఆవిర్భవించిన తర్వాత విజయనగరం తొలి ఎన్నికలకు వెళ్తోంది. ఇందుకోసం యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ నగరపాలికకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరింది.
పురపాలక సంఘం ఏర్పాటులో పూసపాటి వంశీయుల పాత్ర కీలకం. అభినవ ఆంధ్రభోజ బిరుదాంకితులైన ఆనంద గజపతిరాజు ఈ సంఘాన్ని స్థాపించారు. రూ.400 వార్షిక ఆదాయంతో ప్రారంభమై.. ప్రస్తుతం ఏడాదికి రూ.36 కోట్లను ఆర్జిస్తోంది. పారిశుద్ధ్య విధానాన్ని ఆనాడే అమలు చేశారు. 1909-13 మధ్య కాలంలో నెల్లిమర్ల వద్ద గల చంపావతి నదీ ప్రాంతంలో రాణి అప్పలకొండయాంబ నీటి పథకాన్ని ప్రారంభించారు. పట్టణంలోని అన్ని వీధులకూ కుళాయిలు ఏర్పాటు చేశారు. ఈమె ఘోషాసుపత్రి నిర్మించి స్త్రీలకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించారు. 1903లో తొలిసారిగా పట్టణ ఏలికను ఎంపిక చేశారు. దానికి ఛైర్మన్‌గా భూపతిరాజు వెంకటపతిరాజు ఎన్నికయ్యారు. అప్పట్లో ఛైర్మన్ పదవి మూడేళ్లు ఉండేది.
ఆ తరువాత వచ్చిన గుండాల రామావతారం హయాంలోనే కస్పా ఉన్నత పాఠశాల నిర్మాణం జరిగింది. 1959లో జరిగిన ఎన్నికల తరువాత కాలపరిమితి ఐదేళ్లకు మారింది. 1972 నుంచి తొమ్మిదేళ్ల పాటు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. అనంతరం అప్పటి అంజయ్య ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పరోక్ష విధానంలో పునరుద్ధరించింది. 1981-85లో జరిగిన ఎన్నికల్లో పూసపాటి సునీలా గజపతిరాజు ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో ఆమె పదవీ కాలం ఏడాది ఉండగానే కౌన్సిల్ రద్దయింది.
ప్రత్యక్ష ఎన్నికలకు నాంది..
1987లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అప్పట్లో తెదేపా, కాంగ్రెస్‌ల మధ్య జరిగిన పోరులో ప్రజా వైద్యుడిగా పట్టణంలో పేరు గాంచిన పాలూరి శేషగిరిరావు తెదేపా తరఫున గెలుపొందారు. 2010 తర్వాత ఎన్నికలు సకాలంలో జరగలేదు. ప్రత్యేకాధికారుల పాలన వచ్చింది. 2014లో పురపాలక సంఘానికి జరిగిన ఎన్నికల్లో ఛైర్మన్‌గా ప్రసాదుల రామకృష్ణ ఎన్నికయ్యారు. ప్రస్తుతం నగర పాలికగా అవతరించడంతో తొలి మేయర్ హోదాలో ఎవరికి పదవి దక్కనుందోనని అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ముందున్న సమస్యలివీ..
- నగరంలో ఏళ్ల తరబడి తాగునీటి సమస్య ఉంది. వందేళ్ల నాటి పాత పథకాలే ఆదుకుంటున్నాయి. 2011లో వచ్చిన కొత్త పథకం మధ్యలోనే ఆగిపోయింది. ప్రజలు అరకొర నీటి సరఫరాతోనే సర్దుబాటు చేసుకుంటున్నారు.
- శివారు కాలనీలు ఏర్పడుతున్నాయి. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది.
- మురుగునీటి వ్యవస్థ మెరుగుపడాలి. పురాతన డ్రైనేజీ వ్యవస్థ కొనసాగుతోంది. భూగర్భ డ్రైనేజీ కలగానే మిగిలిపోయింది.
- నగరానికి ముంపు బెడద పొంచి ఉంది. భారీ వర్షాలు పడితే ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోంది.
- అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య అదే స్థాయిలో ఉత్పన్నమైంది. దీనిని పరిష్కరించాల్సి ఉంది.
- దుకాణ సముదాయాలు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్నాయి. తద్వారా ఆదాయ మార్గాలను రాబట్టుకోవాలి.
ఇదీ చదవండి: పుర వి'చిత్రం': 'అ' మున్సిపాలిటీలో అయిదేళ్లలో.. అయిదుగురు ఛైర్మన్లు