వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరాన్ని ఆనుకొని కొనసాగుతున్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో సోమవారం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది.
దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఆదివారం భారీ వర్షాలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో 11.2సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
బంగాళాఖాతంలోని అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్లు ఎత్తున మరొక ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే అక్టోబర్ 9వ తేదీ నాటికి అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వివరించింది.