విజయనగరం జిల్లాలో ఉదయం వరకు 69.18 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఆదివారం రాత్రి నుంచి నేటి ఉదయం వరకు ఎడతెరిపిలేని వర్షం కారణంగా గజపతినగరంలో అత్యధికంగా 20సెంమీటర్లు వర్షం కురిసింది. అలాగే నెల్లిమర్ల 19CM, పూసపాటిరేగ 15CM, గరివిడి 14CM, భోగాపురం 13CM, విజయనగరం, డెంకాడలో 12CM వర్షపాతం నమోదైంది. కొత్తవలస 11CM, సాలూరు, రామభద్రపురం 10సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఎగువ కురుస్తున్న వర్షాలకు తోటపల్లి, ఆండ్ర, వట్టిగడ్డ జలాశయాలకు వరదనీటి ప్రవాహం పెరిగింది. తుపాను ప్రభావంతో ఈదురు గాలుల కారణంగా విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 20., 11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లలో సాంకేతిక సమస్య తలెత్తటంతో పాటు.. అక్కడక్కడ విద్యుత్తు స్తంభాలు పడిపోవటంతో ఆదివారం రాత్రి 10గంటల నుంచి ఇప్పటి వరకు సరఫరా పునరుద్ధరించని పరిస్థితి.
అదేవిధంగా తూపాను ప్రభావంతో ఈదురు గాలులకు పలుచోట్ల వృక్షాలు నెలకొరిగాయి. భోగాపురం మండలం చేపల కంచేరు, ముంజెరు, పూసపాటిరేగ మండలం కొనాడ రహదారిపై చెట్లు పడిపోయాయి.
నెల్లిమర్ల రైల్వే స్టేషన్ దాటాక ప్రధాన రహదారిలో చెట్టు కూలిపోవటంతో.. విజయనగరం - పాలకొండ ప్రధాన రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గంట్యాడ మండలం కొండపర్తి - వసంత గ్రామాలకు వెళ్లే రహదారిలో వరద నీరు పోటెత్తడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తవలస మండలంలో వర్షం కురుస్తోంది. గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. అక్కడ ఉన్న ఇళ్లల్లో వరద నీరు వచ్చి చేరింది. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు పడిపోయాయి. జనజీవనం స్తంభించింది. చెరువులు నిండిపోయాయి.
సాలూరు మండలంలో గోముఖ, సువర్ణముఖి, వేగావతి నదుల ఉధృతి కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గరివిడిలోని బంగారమ్మ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. అయితే.. కూలిన చెట్లను తొలగించి వాహన రాకపోకల పునరుద్ధరణకు రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్ అధికారులు.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండీ.. HEAVY RAINS: గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు