కరోనా నియంత్రణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని జిల్లా కొవిడ్ నియంత్రణ ప్రత్యేకాధికారి ఎస్.సత్యనారాయణ అన్నారు. జిల్లాలో కరోనా కట్టడికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ తెలిపారు. ఈ విషయంపై కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రత్యేకాధికారి సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలు కలసికట్టుగా పనిచేసి కరోనా నియంత్రణకు కృషి చేయాలని, అవసరమైన మేరకు ఆసుపత్రులు, వాటిలో పడకలు, మందులు, ఆక్సిజన్ తదితర వాటిని సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి మూడు గంటల్లో వైద్య కిట్లు, అవసరమైన వారికి ఆసుపత్రుల్లో పడకలు సిద్ధం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్లు జీసీ కిశోర్‌కుమార్, మహేష్‌కుమార్, జె.వెంకటరావు, సబ్‌కలెక్టర్ విదెహ్‌ఖరె, డీఆర్వో ఎం.గణపతిరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
విశాఖకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమకూర్చిన కొవిడ్ నియంత్రణ కిట్లను జిల్లాలోని జడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కలెక్టరు, కొవిడ్ నియంత్రణ జిల్లా ప్రత్యేకాధికారి ఎస్.సత్యనారాయణ శనివారం కలెక్టరేట్‌లో అందజేశారు. తొలివిడతగా ఎల్.కోట, కొత్తవలస, ఎస్.కోట, జామి, గంట్యాడ, చీపురుపల్లి, గరివిడి, గుర్ల నెల్లిమర్ల మండలాల్లోని 120 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులే కొవిడ్ బారిన పడుతున్నందున కిట్లు ఇస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. డీఈవో నాగమణి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: