ఆ అమ్మాయి కళ్లను.. ప్రేమ పొరలు కమ్మేశాయి. మనసు మార్చుకోవాలని తల్లిదండ్రులు బతిమలాడారు. తొందరపడొద్దని నచ్చజెప్పారు. అలా చెప్పిన అమ్మపైనే పగబట్టింది ఆ అమ్మాయి. పీకల్లోతు ప్రేమలో మునిగి కన్నతల్లినే పీక పిసికి చంపేసింది. సహజ మరణంగా చిత్రీకరించింది. నిజాన్ని సమాధి చేసేందుకు కట్టుకథ అల్లింది. పోలీసుల విచారణలో కథ అడ్డం తిరిగి కటకటాలపాలైంది.
విజయనగరంజిల్లా సవరవల్లికి చెందిన... లక్ష్మీ, శ్రీనివాసరావు దంపతులకు ఇద్దరు కూమార్తెలు. చిన్న కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంకో కుమార్తె రూపశ్రీ కూడా ఇంటర్‌లో పరిచయమైన వరుణ్ సాయిని ప్రేమించింది. చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని.. తల్లిదండ్రులతో చెప్పింది. చిన్నకుమార్తె విషయంలో పరువుపోయిందని తల్లడిల్లిన తల్లిదండ్రులు మనసు మార్చుకోవాలని రూపశ్రీకి నచ్చచెప్పారు. ససేమిరా అనడంతో రూపశ్రీని తల్లి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేసింది. కానీ ఫోన్ సంబంధాన్ని తెంచలేకపోయింది. ప్రియుడికి ఫోన్ చేసిన రూపశ్రీ తన ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేందుకు ప్రణాళిక వేసింది. ఈ నెల 6న తల్లి లక్ష్మీ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో ప్రియుడికి ఫోన్ చేసి... పిలిపించింది. ఇద్దరూ కలిసి ముక్కు, నోరు మూసి, కాళ్లుచేతులు ఆడకుండా చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందని నిర్థరించుకున్నాక ప్రియుడిని అక్కడి నుంచి పంపేసింది రూపశ్రీ.
పక్కా పథకం ప్రకారం తల్లి గొంతునులిమిన రూపశ్రీ అమ్మ కిందపడి చనిపోయినట్లు తండ్రిని పట్టుకుని రోదించింది. లక్ష్మీ భర్త హుటాహుటిన వైద్యుడిని పిలిపించగా... పల్స్ ఉందని గుర్తించారు. వెంటనే విశాఖలోని.. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రెండ్రోజుల చికిత్స అనంతరం ఆమె చనిపోగా శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా సహజ మరణం కాదని వైద్యులు తేల్చారు. పోలీసులు రంగంలోకి దిగి మృతురాలి ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు పరిశీలించారు. అందులో వరుణ్‌సాయి వచ్చివెళ్లిన దృశ్యాలు అతనితో రూపశ్రీ వరుసగా ఫోన్‌కాల్స్ మాట్లాడినట్లు తేల్చారు. రూపశ్రీని, వరుణ్‌సాయిని.. కటకటాల్లోకి పంపి వారికట్టు కథకు సరైన క్లైమాక్స్ ఇచ్చారు. పిల్లల ప్రవర్తనతోపాటు వాళ్ల ఫోన్‌కాల్స్‌పైనా ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: