విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఎ పరిధిలోని సంక్షేమ వసతి గృహాలకు అందించిన సరుకులు పాడైపోయాయి. నెల రోజుల పనిదినాలు మిగిలి ఉండగానే కరోనా కారణంగా మార్చి 22 నుంచి పాఠశాలను మూసివేశారు. అప్పటికే ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు వండి పెట్టేందుకు సరకులు సిద్ధంగా ఉన్నాయి. తర్వాత స్కూళ్లు తెరచుకోకపోవటంతో వస్తువులన్నీ అలాగే ఉండిపోయాయి. నిల్వ ఉన్న వాటిపై శ్రద్ధ చూపించకపోవటం వల్ల వినియోగానికి పనికిరాకుండా పోయాయి. వాటిని ఏమి చేయాలో తెలియక వసతి గృహ నిర్వాహకులు మల్లగుల్లాలు పడుతున్నారు.
జూన్ 23 నాటికి పాడైపోయిన సరకుల నిల్వలు:
బియ్యం - 1,810 క్వింటాళ్లు
కందిపప్పు - 2,328 కిలోలు
శనగపప్పు - 1,570 కిలోలు
వేరుశనగ చిక్కీలు- 792 కిలోలు
పాలు - 22,500 లీటర్లు
పామాయిల్ - 1000 లీటర్లు
గుడ్లు - 25,000
పాడైన సరకుల విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు సంరక్షకులు చెబుతున్నారు. అధికారుల నుంచి ఎటువంటి సూచనలు రాకపోవడం వల్ల మళ్లీ అక్టోబర్ నెలలో మరిన్ని పనికిరాని వస్తువుల జాబితా జోడించి నివేదిక పంపించామని చెబుతున్నారు. ఆశ్రమ పాఠశాలలో పాడైన వాటిని మినహాయించి మిగిలిన సరకులను పౌరసరఫరాల శాఖకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
ఇదీ చదవండి: గిరిజనులను కబళిస్తున్న అంతుచిక్కని వ్యాధి