విజయనగరం జిల్లాలో కొవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రమణ కుమారి తదితరులతో కలసి తొలి టీకాను ఘెషా ఆసుపత్రి నర్సు జానకమ్మకు వేశారు.
జిల్లాలోని అన్ని నియోజికవర్గాల్లో నేటి నుంచి కరోనా వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే 26 వేల మంది కింది నుంచి పైస్థాయి ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది, అధికారులకు తొలి విడతగా వాక్సినేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. దశల వారీగా అన్ని వర్గాల వారికి కరోనా టీకా వేసే కార్యక్రమం చేపడతామన్న బొత్స.. ఎవ్వరూ వాక్సిన్ కోసం తొందరపడద్దని సూచించారు. ప్రస్తుతం తొలి విడతగా జిల్లాలోని 15 ఆసుపత్రుల్లో వాక్సినేషన్ చేపట్టామని.. మరో 28 రోజుల తర్వాత రెండో డోసు వాక్సిన్ వేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కన్నారు.
పంపిణీ కేంద్రాల్లో నిబంధనలు తప్పక పాటించాల్సిందే..
పంపిణీ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ పొందేందుకు లబ్ధిదారులు నిబంధనలు పాటించాల్సిందే. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిని స్టాఫ్ నర్స్ పరిశీలిస్తుంది. అనంతరం ఎలాంటి లోటుపాట్లు, రుగ్మతలు లేకపోతే టీకా వేసుకునేందుకు అనుమతిస్తాం. ఆ తర్వాత అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతాం. అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఏదైన సమస్య వస్తే వెంటనే చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాం. -జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి రమణ కుమారి.
టీకా తీసుకున్న 61 ఏళ్ల మానసిక వైద్య నిపుణుడు..
విజయనగరంలోని పూల్ బాగ్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో 61 ఏళ్ల మానసిక వైద్య నిపుణుడు సత్యనారాయణ డి.ఎం.హెచ్.ఓ వి.రమణ కుమారి ఆధ్వర్యంలో వ్యాక్సిన్ తీసుకున్నారు. తనకు ఏ రకమైన ఆందోళన గాని కనీసం టీకా వేసుకున్నాననే భావన కూడా లేదన్నారు సత్యనారాయణ. ప్రతిఒక్కరూ ఏమాత్రం సంకోచించకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని.. దీనిపై సందేహాలు అవసరం లేదన్నారు. టీకా వేసుకున్న పలువురు మహిళ వైద్య సిబ్బంది సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
చీపురుపల్లి సామాజిక ఆసుపత్రిలో..
చీపురుపల్లిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో పాటు.. కలెక్టర్ హరిజవహర్‌లాల్ జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
శృంగవరపుకోటలో వాక్సినేషన్ ప్రారంభం..
విజయనగరం జిల్లా శృంగవరపుకోట సామాజిక ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ కొవీషీల్డు టీకా ప్రక్రియ ప్రారంభమైంది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి మొదట వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. జిల్లా పరిషత్ సీఈవో వెంకటేశ్వరరావు వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
తొలిరోజు వందమంది వైద్య ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 52 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ త్రినాధ రావు మొదటగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ తర్వాత సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు.
ఇదీ చదవండి: దిల్లీ పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా