భాజాపా, వైకాపాలు దేశంలో పేద, దళిత, ఆదివాసులపై దౌర్జన్యం చేస్తున్నాయని.. వారిని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాపాడుతోందని పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య పదవ తరగతి ఫలితాల్లాగా పదవులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. కుర్చీలు కూడా లేని పదవులను దళిత, బలహీన వర్గాలకు కట్టబెట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి దళితుల వ్యతిరేకి అని వ్యాఖ్యానించారు. వారి ఓట్ల కోసం పైపై మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. మన్యంలో జరుగుతున్న దోపిడీని అడ్డుకుని.. చింతపల్లి అటవీ ప్రాంతం నుంచి పోరాటం మెుదలు పెడతామని అన్నారు.
పిల్లలకు కరోనా సోకుతున్నవేళ పాఠశాలలా...
ఒకవైపు బెంగళూరులో చిన్నారులకు కరోనా వ్యాప్తి పెరుగుతుండగా.. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం చేయడం ఏంటని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో కొవిడ్ మూడో వేవ్ వచ్చేఅవకాశం ఉందని వార్తలకు తోడు.. గడచిన ఐదు రోజుల వ్యవధిలోనే బెంగళూరు నగరంలో దాదాపు 242 మంది చిన్నారులకు (18 సంవత్సరాల లోపు) కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఇటువంటి సమయంలో పాఠశాలల్లో పాటించవలసిన జాగ్రత్తలు, భౌతిక దూరం, శానిటైజేషన్ సరిగా చేయకపోతే చాలా ప్రమాదకర పరిస్థితుల వస్తాయని అన్నారు. ఇటువంటి సమయంలో పాఠశాలల్లో అన్ని జాగ్రత్తలు పాటించేలా ప్రభుత్వం చూడాలని సూచించారు. పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి, ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
viveka murder case: వివేకా కేసు.. కడప, పులివెందులలో అనుమానితుల విచారణ