విజయనగరంలో ప్రజలంతా లాక్‌డౌన్‌కు సిద్దం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ సూచించారు. కరోనా నియంత్రణకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో విజయనగరం కలెక్టర్ చాంబర్ లో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంఎల్ఏలు కోలగట్ల వీరభద్రస్వామి, అలజంగి జోగారావు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రస్తుతం రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌కు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. ఆదివారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో కూడా అత్యధిక శాతం మంది లాక్‌డౌన్ విధించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు.
జిల్లాలో కొత్తగా మూడు మిషన్లు, 6వేల ర్యాపిడ్ ఏంటిజన్ కిట్లు వచ్చాయని, వీటిద్వారా అదనంగా రోజుకి వెయ్యి వరకూ కరోనా నిర్ధారణా పరీక్షలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ టెస్టులద్వారా కేవలం 5 నిమిషాల్లోనే ఫలితం వెలువడుతుందని తెలిపారు. విజయనగరం ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ... ఎవరికీ మినహాయింపులు లేని విధంగా లాక్‌డౌన్‌ను విధించాలని సూచించారు. పార్వతీపురంలో కోవిడ్ కేర్ సెంటర్‌ను త్వరగా ఏర్పాటు చేసి, వెంటనే ప్రారంభించాలని శాసనసభ్యులు అలజంగి జోగారావు కోరారు.