విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి, ఘోషా ఆసుపత్రుల్లో అదనపు వసతులు కల్పించేందుకు ఆసుపత్రి అభివృద్ది సంఘం ఆమోదం తెలిపింది. సంఘ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ అధ్యక్షతన కలెక్టర్ ఛాంబర్‌లో అభివృద్ది సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 29 అంశాలతో కూడిన అజెండాను సంఘం కన్వీనర్, జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే. సీతారామరాజు సభ్యులకు వివరించారు. వారు ఆయా అంశాలపై చర్చించి ఆమోదించారు.
ఘోషా ఆసుపత్రిలో అసంపూర్తిగా ఉన్న క్యాంటీన్ పనులు పూర్తిచేసి, రోగులకు అందుబాటులో తీసుకురావాలని నిర్ణయించారు. 6 వార్మర్లు, ఆపరేషన్ టేబుల్, వివిధ విభాగాలకు 5 ఏసీలను, పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలు సమకూర్చడానికి, ఓటీ కాంప్లెక్స్ మరమ్మతులకు అంగీకరించారు.
జిల్లా కేంద్ర ఆసుపత్రిలో డీఎన్బీ, ఓటీ విభాగాలను అభివృద్ది చేసేందుకు, ఇక్కడి నుంచి ఆయుష్ విభాగాన్ని కొత్త భవనంలోకి పూర్తిగా తరలించేందుకు, కాంపౌండ్ వాల్, క్యాజువాలిటీ ఫ్లోర్, కిచెన్ షెడ్ మరమ్మతులు, ఆసుపత్రిలో కుర్చీలు, బల్లలు, మంచాలకు రంగులు వేసేందుకు, వివిధ విభాగాల్లో 4 ఏసీలు, ఫెన్సింగ్ ఏర్పాటుకు, స్టేషనరీ కొనుగోలుకు ఆమోదం తెలిపారు.
జిల్లా ఆసుపత్రికి, ఘోషా ఆసుపత్రికి కొత్తగా 5 ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లు కావాలని కమిషనర్‌ను కోరాలని తీర్మానించారు. ఆసుపత్రికి కావాల్సిన మందులు, ల్యాబ్ పరికరాలు, సర్జికల్స్ సరఫరాకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు సంఘ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ హాస్పిటల్స్ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరచడానికి కృషి చేయాలని కలెక్టర్ హరి జవహర్‌లాల్ కోరారు. సంఘ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిబంధనల ప్రకారం అమలు చేయాలని ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తి చేసి, వీలైనంత త్వరగా రోగులకు సేవలందించేలా చూడాలన్నారు. జిల్లా ఆసుపత్రికి ఒక అంబులెన్సును మంజూరు చేయాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను కలెక్టర్ కోరారు.
కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి: ఎంపీ
ప్రపంచంలోని పలు దేశాల్లో, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొవిడ్ రెండోదశ మొదలైందని.. దీన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. కరోనా మొదటి దశను సమర్థవంతంగా ఎదుర్కొన్న జిల్లా యంత్రాంగాన్ని, వైద్యులను, ఇతర సిబ్బందిని అభినందించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులను, పరికరాలను, యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. తక్షణమే శస్త్రచికిత్సలను పునఃప్రారంభించాలని, చిన్నచిన్న కేసులను కేజీహెచ్‌కు తరలించే విధానాన్ని విడనాడాలని ఎంపీ కోరారు.
ఇవీ చదవండి..