Central Fisheries Minister Parshottam Rupala Visit: ఏపీలోని మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని, చింతపల్లిలో పక్కా జట్టీ నిర్మాణం చేపడతామని కేంద్రమత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల హామీ ఇచ్చారు. సాగర్ పరిక్రమ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి రూపాలా విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం మత్స్యకార గ్రామం చింతపల్లిలో పర్యటించారు.
ఈ పర్యటనలో రూపాలాతో పాటు ఆ శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్, కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి నీతు ప్రసాద్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయడు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సాగర్ పరిక్రమ్ కార్యక్రమంలో భాగంగా చింతపల్లి గ్రామానికి విచ్చేసిన కేంద్ర మంత్రి రూపాలాకు మత్స్యకారులు సాదర స్వాగతం పలికారు. గ్రామానికి చేరుకున్న కేంద్ర మంత్రులు రూపాలా, మురుగన్ అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. స్థానిక మత్స్య కారులతో మమేకమై వారి జీవన పరిస్థితులను తెలుసుకున్నారు.
చేపలు విక్రయిస్తున్న మహిళలతో మాట్లాడుతూ వాటి విక్రయం ద్వారా ఆర్జిస్తున్న ఆదాయంపై ఆరా తీశారు. సముద్ర తీరంలో మత్స్యకారులతో కలసి కాసేపు సరదగా ముచ్చటించారు. జిల్లాలో మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం మత్స్యసంపద యోజన, ఇతర పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంత్రులకు వివరించారు. అనంతరం ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంత్రులు కిసాన్ క్రిడెట్ కార్డు పరపతి మొత్తాలను చెక్కుల రూపంలో అందజేశారు.
అంతకు ముందు జరిగిన బహిరంగ సభలో స్థానిక మత్స్యకార సంఘం ప్రతినిధులు, సభ్యులు మాట్లాడుతూ పలు సమస్యలను మంత్రులకు తెలియజేశారు. చింతపల్లిలో ఫ్లోటింగ్ జెట్టీ కాకుండా శాశ్వత జెట్టీ నిర్మించాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల స్పందిస్తూ చింతపల్లి మత్స్యకారులకు శాశ్వత జెట్టీని మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడి నుంచి దిల్లీకి వెళ్లిన వెంటనే ఇందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేసేలా చర్యలు చేపడతామని చెప్పారు. చింతపల్లి ప్రాంతం నుంచి మత్స్యకారులు అధికంగా గుజరాత్ రాష్ట్రానికి వలస పోతున్న విషయం తనకు ఇక్కడికి వచ్చినపుడే తెలిసిందన్నారు. చింతపల్లి మత్స్యకారులు ఉపాధి అవసరాల కోసం వలసలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే శాశ్వత జెట్టీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Sarpanch Association Met Central Minister: నిధుల మళ్లింపు.. కేంద్రమంత్రికి సర్పంచుల సంఘం ఫిర్యాదు
అనంతరం కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ సహాయమంత్రి మురుగన్ మాట్లాడుతూ సాగర్ పరిక్రమలో భాగంగా గత ఏడాదిన్నర కాలంలో 7 వేల కిలోమీటర్ల తీరప్రాంతంలో పర్యటించడం జరిగింది. మత్స్యకారులకు ఉద్దేశించిన పథకాలు క్షేత్రస్థాయిలో వారికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలుసుకోవడమే సాగర్ పరిక్రమ్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద 20 వేల కోట్లతో మత్స్యకారుల కోసం కేంద్రం పలు పథకాలు అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీరప్రాంతాల అభివృద్ధికి, బ్లూ ఎకానమీలో భాగంగా చేపట్టిన ఫిషరీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద అధికంగా లబ్దిపొందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ప్రతి ఒక్క మత్స్యకారుడి వద్ద కిసాన్ క్రెడిట్ కార్డు ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.