రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనే అధికారికంగా 74 కేసులు నమోదు కాగా... ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ బాధితులు చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్‌తో జిల్లాలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. ఓ వైపు చికిత్సకు అవసరమయ్యే కీలక ఇంజక్షన్లకు ఒక్కసారిగా కొరత ఏర్పడింది. ఇదిలా ఉండగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఇంజెక్షన్లు నిలిపివేయడంపై ఆందోళన చెందారు. జీజీహెచ్‌లో తమను చేర్చుకోవడం లేదని మరికొందరు బాధితులు ఆవేదన చెందుతున్నారు. బ్లాక్ ఫంగస్ రోగులకు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నామని, మందుల కొరతపై ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
చిత్తూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ క్రమేపీ విస్తరిస్తోంది. సోమవారం ఒక్క రోజే రుయాలో 9, స్విమ్స్ లో 6 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 33కి చేరుకోగా... వీరిలో రుయాలో 21, స్విమ్స్ 12 మంది చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్‌తో మరో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మందుల కొరత కారణంగా ఏ రోజుకు ఆరోజు మాత్రమే ఆసుపత్రులకు ఔషధాలు అందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
విజయనగరం జిల్లాలోనూ బ్లాక్ ఫంగస్ తొలి కేసు నమోదైంది. బ్లాక్ ఫంగస్‌తో డెంకాడ మండలం బొడ్డవలసకు చెందిన రామారావు ప్రాణాలు కోల్పోయారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. ఏ ఆస్పత్రిలోనైనా బ్లాక్ ఫంగస్ సోకిన వారికి వైద్యం నిరాకరిస్తే సంబంధిత ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీచదవండి.