రామతీర్థం మళ్లీ అట్టుడికింది. నినాదాలతో హోరెత్తింది. భాజపా - జనసేన శ్రేణులు తరలిరావడం, వారిని పోలీసులు బలవంతంగా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో కోదండరాముడి విగ్రహ శిరస్సును ధ్వంసం చేసిన ఘటనను నిరసిస్తూ మంగళవారం భాజపా, జనసేన నాయకులు ధర్మయాత్ర తలపెట్టగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గురువారం మరోసారి చలో రామతీర్థం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దాంతో నెల్లిమర్లలోని రామతీర్థం కూడలిలో పోలీసులు మోహరించారు. ప్రధాన మార్గాలన్నింటినీ దిగ్బంధం చేశారు. ఉదయం 10 గంటలకే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, జనసేన పీఏసీ సభ్యురాలు యశస్వి పార్టీ శ్రేణులతో కలిసి రామతీర్థం కూడలికి చేరుకున్నారు. జై శ్రీరాం అంటూ దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు తీవ్రంగా ప్రతిఘటించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో గందరగోళం నెలకొంది.
స్పృహ తప్పిన నాయకులు
ఎంపీ విజయసాయిరెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబులను కొండ మీదకు అనుమతించి.. భాజపా, జనసేన నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారని సోము వీర్రాజు పోలీసులను ప్రశ్నించారు. ఐదుగురికే అనుమతిస్తామని చెప్పగా వారు అంగీకరించలేదు. బారికేడ్లు, పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. అరగంట పాటు విష్ణువర్ధన్‌రెడ్డి రోడ్డుపైనే పడుకుండిపోయారు. కార్యకర్తలు సపర్యలు చేశారు. తర్వాత పోలీసులు ఆయన్ను విజయనగరం, అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖ పంపించారు. వీర్రాజు, జీవీఎల్ నరసింహరావును బలవంతంగా అదుపులోకి తీసుకొని గుర్ల సమీపంలోని ఓ ఎస్టేట్‌కు తరలించారు. ఎమ్మెల్సీ మాధవ్, జనసేన నాయకురాలు యశస్విని విజయనగరం ఒకటో పట్టణ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మిగిలినవారిని సమీప స్టేషన్లకు తరలించారు.
పెళ్లి వాహనాల్లో చేరుకొని..
పోలీసుల నిర్బంధం ఎక్కువగా ఉండటంతో కొందరు వ్యూహాత్మకంగా నెల్లిమర్ల చేరుకున్నారు. ఏదో పెళ్లికి వెళ్తున్నట్లు వాహనాలకు స్టిక్కర్లు అతికించుకొని కొందరు వచ్చారు. రామతీర్థం కూడలి రాగానే వాహనాలు దిగారు. మరికొందరు అనుమానం రాకుండా ఆటోల్లో వచ్చారు. గుంపులుగా వస్తే అడ్డుకుంటారని విడివిడిగా వచ్చి ఆందోళనలో కలిసిపోయారు.
సీఎం క్షమాపణ చెప్పాలి: వీర్రాజు
రామతీర్థం వెళ్లకుండా భాజపాను అడ్డుకుంటున్న ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాముని పట్ల అపచారం జరిగితే అక్కడికి వెళ్లకుండా తమను అడ్డుకొని.. ఎంపీ విజయసాయిరెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబును ఎలా అనుమతించారో సమాధానం చెప్పాలన్నారు.
ప్రభుత్వానికి పతనం తప్పదు: జీవీఎల్
రాష్ట్రంలో భాజపా ఎదగకుండా ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఈ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు.
* ఆలయాలు కూల్చిన తర్వాత తలెత్తుతున్న ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకుచేస్తున్న కంటితుడుపు చర్యే శాంతికమిటీ అని, ఇది సమస్యను పక్కదారి పట్టించేందుకేనని భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు ట్విటర్‌లో విమర్శించారు.