భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం 2,700 ఎకరాల భూములు సేకరించింది. అలాగే నాలుగు గ్రామాలను తరలించాలని నిర్ణయించింది. ఈమేరకు బొలింకలపాలెం, రెల్లిపేట, మూడసర్లపేట గ్రామాలకు చెందిన వారికి గూడెపువలసలో నిర్వాసితుల కాలనీకి 17 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ నిర్మాణాలు బాగానే జరుగుతున్నాయి. కానీ మరడపాలెంకు చెందిన 223 కుటుంబాలకు... పోలిపల్లి రెవెన్యూలోని లింగాలవలస వద్ద 25 ఎకరాల్లో ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇవి కొండకు అనుకొని ఎత్తయిన ప్రాంతంలో ఉండటంతో నిర్మాణానికి అనువుగా లేవు. నిర్వాసితుల కాలనీలో పనులు మొదలుపెట్టిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
బాంబులు పెట్టి పేల్చాల్సిన పరిస్థితి..
ఒక్కో కుటుంబానికి రూ. 9. 36 లక్షల సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంటి పనులు ప్రారంభిస్తే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అధికారులు తెలిపారు. వందల మంది నిర్మాణానికి ముందుకొచ్చి... చాలా వరకు ఇళ్ల పనులను గుత్తకు ఇచ్చారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 15 లక్షల నుంచి 17 లక్షల వరకు తీసుకుంటున్నారు. కానీ భూమి లోపల పెద్దపెద్ద బండలు ఉండటంతో పనులు ముందుకు సాగడం లేదు. వీటిని బాంబులు పెట్టి పేల్చాల్సి వస్తోంది. ఇందుకోసం అదనంగా వేలాది రూపాయలు ఖర్చుచేయక తప్పడం లేదు.
పునాదుల వరకే 5 లక్షల వరకు ఖర్చు..
ఇంటి నిర్మాణానికి రూ. 9. 36 లక్షలు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నా... ఇందులో ఇతర సాయం కూడా కలిసి ఉంది. ఇంటి నిర్మాణానికి 2లక్షలు 85 వేలు మాత్రమే ఇస్తున్నారు. మిగతా మొత్తంలో రవాణా ఛార్జీలు, కులవృత్తులు, చిరు వర్తకులకు నెలకు 3 వేల చొప్పున ఇస్తామన్న భృతి, ఉద్యోగం అవకాశం ఇవ్వనివారికి ఆర్థికసాయం లాంటివి ఉన్నాయి. మూడు విడతల్లో పరిహారం ఇస్తామని చెప్పడంతో... చాలామంది ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. కానీ ఇప్పటికీ కొందరికి 50 వేల రూపాయలకు మించి రాలేదు. పునాదుల వరకే 5 లక్షల వరకు ఖర్చవుతోందని నిర్వాసితులు చెబుతున్నారు. అధికారులు మాత్రం నిర్వాసితులు వేగంగా పనులు పూర్తిచేయాలని... ఈ నెలాఖరు నుంచి బాంబులు పెట్టడానికి అనుమతి ఇవ్వబోమని అంటున్నారు.
ఇదీ చదవండి: Bhogapuram Airport Lands: 'రైతుల పేరుతో వైకాపా నేతలు భూపరిహారం కాజేస్తున్నారు'