విజయనగరం జిల్లా బోడికొండపై ఉన్న కోదండ రామాలయ నిర్మాణం కోసం జరుగుతున్న శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత చెలరేగింది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. ప్రభుత్వం శంకుస్థాపనం చేయడం ఏంటని ఆలయ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు ప్రశ్నించారు. ధర్మకర్తల మండలితో చర్చించకుండానే ప్రభుత్వం.. ఆలయ పునర్నిర్మాణం చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు తరఫున ఏర్పాటు చేసిన పునర్నిర్మాణ, శంకుస్థాపన శిలాఫలకాలను తోసేశారు. స్పందించిన అధికారులు అశోక్ గజపతిరాజును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో అధికారులు.. అశోక్‌కు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. కోదండ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం మంత్రులు వెల్లంపల్లి, బొత్స నారాయణలు గుడికి వచ్చారు.
హిందూ ధర్మాన్ని కాపాడాలి..!
దేవదాయ శాఖ ఆనవాయితీని వైకాపా ప్రభుత్వం పాటించట్లేదని అశోక్‌గజపతిరాజు అన్నారు. ట్రస్టు బోర్డులను గౌరవించే పరిస్థితి ఈ సర్కారుకు లేదని విమర్శించారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరారు. అలాగే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై 147 దాడులు జరిగాయని... ఈ ఘటనల్లో ప్రభుత్వం ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేకపోయిందని అశోక్‌గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణం ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పి... ఏడాది తర్వాత శంకుస్థాపన చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోందని.. ఆలయ పునర్నిర్మాణంలో నిబంధనలు పాటించట్లేదని చెప్పారు. అమరావతి రైతుల మాదిరిగానే తనను కూడా ప్రభుత్వాధికారులు వేధిస్తున్నారు అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది?
గతేడాది డిసెంబర్ 28న విజయనగరం జిల్లా బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో రాముడి శిరస్సు భాగం ధ్వంసమైంది. ఈ విషయం తెలుసుకున్న రామ భక్తులు.. ఆలయాలకు రక్షణ లేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని సంప్రదాయ పద్ధతిలో తొలగించి పునర్నిర్మించాలని నిర్ణయించింది.
ఇదీ చూడండి:
AP Govt Talks with Employees Union: నేడు ఉద్యోగ సంఘాలతో మరోమారు ప్రభుత్వం చర్చలు!